National: రాహుల్ గాంధీ బంగ్లాను ఖాళీ చేయాలి

మోదీపై అనుచిత వ్యాఖ్యల కేసులో ఎంపీ పదవి నుంచి అనర్హతకు గురైన రాహుల్ గాంధీకి లోక్‌సభ హౌసింగ్ కమిటీ షాక్ ఇచ్చింది. తన అధికారిక బంగ్లాను సైతం ఖాళీ చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. నెల రోజుల్లో తన అధికారిక నివాసాన్ని ఖాళీ చేయాలని సమాచారం ఇచ్చింది. ఏప్రిల్ 22లోగా అధికారిక బంగ్లాను ఖాళీ చేయాలని డెడ్‌లైన్ పెట్టినట్టు పార్లమెంట్‌వర్గాలు తెలిపాయి. 2004 ఎన్నికల్లో రాహుల్ గాంధీ లోక్‌సభ ఎంపీగా ఎన్నికైన తర్వాత ఆయనకు ఢిల్లీలోని తుగ్లక్ లేన్‌లో బంగ్లాను కేటాయించారు. దీంతో అక్కడే నివాసం ఉంటున్నారు రాహుల్ గాంధీ. అయితే, తాజా పరిణామాల నేపథ్యంలో ప్రభుత్వ నివాస గృహంలో ఉండేందుకు అనర్హుడిగా పేర్కొంటూ లోక్‌సభ హౌసింగ్ కమిటీ నోటీసులు ఇచ్చినట్టు తెలుస్తోంది.
2004లో లోక్‌సభకు ఎన్నికైనప్పటి నుంచి రాహుల్ గాంధీకి ఢిల్లీ తుగ్లక్ మార్గ్‌లోని 12వ నంబరు బంగ్లాను కేటాయించారు. అయితే, ఇటీవల ఓ కేసులో సూరత్ కోర్టు ఆయనకు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. అప్పీలుకు వెళ్లేందుకు 30 రోజులు గడువు ఇచ్చింది. కోర్టు తీర్పు వచ్చిన మరుసటి రోజే రాహుల్ గాంధీ లోక్‌సభ సభ్యత్వానికి అనర్హుడంటూ లోక్‌సభ సెక్రటేరియట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇలా ఎంపీ సభ్యత్వాన్ని కోల్పోవడంతో ఆయనకు వచ్చే ప్రభుత్వ సదుపాయాలు, ఇతర ప్రయోజనాలు కూడా రద్దవుతాయి. ఈ క్రమంలోనే అధికార నివాసాన్ని ఖాళీ చేయాలని లోక్‌సభ హౌసింగ్ కమిటీ వెల్లడించినట్లు తెలుస్తోంది. అయితే, పై కోర్టులో రాహుల్‌కు ఊరట లభిస్తే తప్ప ఏప్రిల్ 22లోపు తన అధికార నివాసాన్ని ఖాళీ చేయక తప్పదు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com