National: చక్కినట్లే చిక్కి దేశం దాటిన అమృత్‌పాల్‌ సింగ్‌

National: చక్కినట్లే చిక్కి దేశం దాటిన అమృత్‌పాల్‌ సింగ్‌
నేపాల్‌లో ఉన్నట్లు అధికారులు అనుమానం, మరో దేశానికి పారిపోకుండా చూడాలని నేపాల్‌ ప్రభుత్వానికి లేఖ

పంజాబ్‌ పోలీసుల నుంచి తప్పించుకుని తిరుగుతున్న ఖలిస్థానీ సానుభూతిపరుడు అమృత్‌పాల్‌ సింగ్‌ దేశం దాటినట్లు తెలుస్తోంది. అతడు నేపాల్‌లో ఉన్నట్లు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే అతడు మరో దేశానికి పారిపోకుండా చూడాలని నేపాల్‌ ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు నేపాల్‌ కాన్సులర్‌ సేవల విభాగానికి అక్కడి భారత రాయబార కార్యాలయం లేఖ రాసినట్లు తెలుస్తోంది.

పంబాజ్‌లో ఖలిస్థానీ భావజాలాన్ని వ్యాప్తి చేసేందుకు ప్రయత్నిస్తున్న అమృత్‌పాల్‌ను అరెస్టు చేసేందుకు ఇటీవల పోలీసులు పక్కా వ్యూహాన్ని అమలు చేశారు. అయితే అతడు చిక్కినట్లే చిక్కి పోలీసుల నుంచి తప్పించుకున్నాడు. అప్పటి నుంచి అతడి ఆచూకీ కోసం పోలీసులు ముమ్మర వేట కొనసాగిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే అతడు హరియాణా, ఉత్తరాఖండ్‌ రాష్ట్రాల నుంచి దేశ సరిహద్దులు దాటి నేపాల్‌ వెళ్లినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

అమృత్‌పాల్‌కు పాకిస్థాన్ నిఘా సంస్థ ఐఎస్‌ఐ మద్దతు ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ఐఎస్‌ఐ ఏజెంట్లతో అతడికి విస్తృతంగా పరిచయాలున్నాయని ప్రచారం జరుగుతుంది. పాకిస్థాన్‌ నుంచి తరచూ పంజాబ్‌లోకి చొరబడే డ్రోన్ల ద్వారా అమృత్‌పాల్‌కు అవసరమైన ఆయుధాలు ఐఎస్‌ఐ ఏజెంట్లు సమకూర్చినట్లు అనుమానాలు కూడా ఉన్నాయి. నేపాల్‌ గత కొన్నేళ్లుగా ఐఎస్‌ఐ ఆపరేషన్లకు అడ్డాగా మారింది. ఆ దేశంలోని కొన్ని సంస్థలు పాకిస్థానీ ఐఎస్‌ఐ, లష్కరే తోయిబా ముఠాలకు స్వర్గధామంగా మారాయి. అక్కడే ఐఎస్‌ఐ.. స్లీపర్‌సెల్స్‌ను తయారుచేసి భారత్‌కు పంపిస్తున్నట్లు గతంలో అనేక కథనాలు వెలువడ్డాయి. ఈ క్రమంలోనే అమృత్‌పాల్‌ కూడా నేపాల్‌ను ఎంచుకున్నట్లు తెలుస్తోంది. అక్కడ ఐఎస్‌ఐ సానుభూతిపరుల అండతో పోలీసులకు చిక్కుకుండా ఉంటాడని భారత్‌ అనుమానిస్తోంది. ఇక అమృత్‌పాల్‌కు అనేక పేర్లతో పలు దేశాల పాస్‌పోర్టులు ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో నకిలీ పాస్‌పోర్టులతో అతడు నేపాల్‌ నుంచి కూడా పారిపోయే అవకాశాలున్నాయి. ఈ క్రమంలోనే భారత్‌ పొరుగు దేశానికి లేఖ రాసింది.

Tags

Next Story