National: భారత్ భూభాగంలో అంగుళం కూడా తీసుకోలేరు: అమిత్‌షా

భారత్ భూభాగంలో అంగుళం కూడా ఎవరూ తీసుకోలేరన్నారు కేంద్రం హోంశాఖ మంత్రి అమిత్ షా. అరుణాచల్ ప్రదేశ్ పర్యటలో ఉన్న ఆయన చైనా చర్యలను పరోక్షంగా తిప్పికొట్టారు. తన అరుణాచల్ ప్రదేశ్ పర్యటనపై చైనా అభ్యంతరం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. భారతదేశ ప్రాదేశిక సమగ్రతను ఎవరూ ప్రశ్నించలేరని అన్నారు. భారత్ భూభాగంలో ఒక్క అంగుళం కూడా ఎవరూ తీసుకోలేరని తీవ్రంగా వ్యాఖ్యానించారు. అరుణాచల్‌ప్రదేశ్ తమ పరిధిలోకి వస్తుందన్న చైనా.. ఆ ప్రాంతంలో భారత్ అధికారిక కార్యక్రమాలు నిర్వహించడం తమ దేశ భౌగోళిక సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించడమేనని అంటోంది. ఓ వైపు భారత్-చైనా మధ్య అరుణాచల్ ప్రదేశ్‌పై మాటల యుద్ధం జరుగుతున్నప్పటికీ..అమిత్ షా తన షెడ్యూల్ ప్రకారమే అక్కడ పర్యటించారు. భారత్-చైనా సరిహద్దు గ్రామమైన కిబితూలో వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రాం ను ప్రారంభించారు.
2014కు ముందు ఈశాన్య ప్రాంతమంతా అభివృద్ధికి దూరంగా.. అల్లకల్లోలంగా ఉండేదని... అయితే, బీజేపీ సర్కార్ లుక్ ఈస్ట్’ విధానంతో భారతదేశ అభివృద్ధిలో ఈ ప్రాంతం కూడా భాగమైందన్నారు అమిత్ షా. కొత్తగా పేర్లు పెట్టినంత మాత్రాన భారత్‌లో భాగమైన అరుణాచల్‌ప్రదేశ్‌ను దేశం నుంచి వేరు చేయలేరని చైనాను హెచ్చరించారు. భారత సైనిక, సరిహద్దు భద్రతా దళాలను ప్రశంసించిన ఆయన.. ఐటీబీపీ జవాన్లు, ఇండియన్ ఆర్మీ అహర్నిశలూ శ్రమిస్తూ దేశాన్ని కంటికి రెప్పలా కాపాడుతున్నారని కితాబిచ్చారు. జవాన్లు చేస్తున్న ఈ త్యాగం వల్లే దేశ ప్రజలంతా ప్రశాంతంగా నిద్ర పోగలుగుతున్నారని చెప్పారు. భారతదేశాన్ని చెడు దృష్టితో చూసే శక్తి ఎవరికీ లేదని గర్వంగా చెప్పగలమన్నారు.
ఈ నెల 2న చైనా అరుణాచల్‌ప్రదేశ్‌లోని 11 ప్రదేశాలకు మాండరీన్ పేర్లను పెట్టింది. ఈ విషయాన్ని ఆ దేశ పౌరవ్యవహారాల శాఖ ప్రకటించింది. ఈ మేరకు అరుణాచల్‌ను దక్షిణ టిబెట్‌గా చూపిస్తున్న మ్యాప్‌ను విడుదల చేసింది. ఈ నేపథ్యంలో షా పర్యటనపై ఓ ఆంగ్ల వార్త సంస్థ చైనా విదేశాంగశాఖ ప్రతినిధి వాంగ్ వెన్‌బిన్‌ను ప్రశ్నించింది. దీనికి ఆయన స్పందిస్తూ అరుణాచల్ ప్రదేశ్ చైనా భూభాగమని... . అక్కడ భారత అధికారులు పర్యటించడం తమ భౌగోళిక సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించడమేనన్నారు. ఈ చర్య శాంతికి ఏమాత్రం తోడ్పడదని పేర్కొన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com