జాతీయం

మన దేశంలో నేషనల్ ఎమర్జెన్సీ లాంటి పరిస్థితులున్నాయి : సుప్రీం కోర్టు

మరోవైపు అటు కేంద్రం, ఇటు ఢిల్లీ సర్కారుపై ఢిల్లీ హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఆక్సీజన్ కొరతపై దాఖలైన పిటీషన్లపై విచారణ జరిపిన ఢిల్లీ హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది.

మన దేశంలో నేషనల్ ఎమర్జెన్సీ లాంటి పరిస్థితులున్నాయి : సుప్రీం కోర్టు
X

కరోనా రోజురోజుకు వికృత రూపం చూపిస్తోంది. ఈ మహమ్మారి చాలా స్పీడ్‌గా దేశాన్ని చుట్టేస్తోంది. దీంతో రోజువారీ కేసుల సంఖ్య 3 లక్షల 14 వేలకు చేరింది. కేసులు పెరుగుతున్న కొద్దీ రోగులతో హాస్పిటల్‌ నిండిపోతున్నాయి. బెడ్లు కూడా దొరకడం లేదు. మందుల కొరత ఏర్పడింది. ఇక ప్రాణాలు నిలిపే ఆక్సీజన్ కొరత తీవ్రంగా ఉంది. వీటితోపాటు వ్యాక్సిన్లు కూడా సరిపోవడం లేదంటూ దేశంలోని పలు హైకోర్టుల్లో పిటిషన్లు దాఖలయ్యాయి. పరిస్థితిని గమనించిన సుప్రీం కోర్టు... హైకోర్టుల్లో జరుగుతున్న విచారణను సుమోటోగా స్వీకరించింది. ఆక్సీజన్, కరోనా మందులు, వ్యాక్సినేషన్‌ ప్రక్రియపై జాతీయ ప్రణాళిక ఉందా అంటూ కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీం ధర్మాసనం ప్రశ్నించింది. ఇందుకు సంబంధించిన కేంద్రానికి నోటీసులు జారీ చేసింది.

ప్రస్తుతం మన దేశంలో నేషనల్ ఎమర్సెన్సీ లాంటి పరిస్థితులు ఉన్నాయని సుప్రీం ధర్మాసనం వ్యాఖ్యానించింది. కరోనాను ఎదుర్కొనేందుకు అనుసరించే పద్ధతులతోపాటు వ్యాక్సినేషన్ ప్రక్రియపై ప్రణాళికను సమర్పించాలని కేంద్రాన్ని ఆదేశించింది. మరోవైపు ఆక్సిజ‌న్ సప్లై, అత్యవసర మందుల స‌ర‌ఫ‌రా, వ్యాక్సినేష‌న్ ప్రక్రియ కొన‌సాగుతున్న తీరు, లాక్‌డౌన్‌లు విధించుకునే అధికారం రాష్ట్రాల‌కు వ‌దిలేయాల‌న్న అంశాల‌పై సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వ అభిప్రాయాలు కోరింది. ఇక కొవిడ్‌కు సంబంధించి దాఖలైన పిటిషన్లపై ప్రస్తుతం ఢిల్లీ, బాంబే, సిక్కిం, కలకత్తా, అలహాబాదు హైకోర్టులు విచారణ జరుపుతున్నాయి. అయితే ప్రస్తుతానికి ఆయా కోర్టులు విచారణ కొనసాగించవచ్చని సుప్రీం కోర్టు చెప్పింది. కానీ కొన్ని అంశాలను మాత్రం తమ పరిధిలోకి తీసుకుంటున్నట్లు ధర్మాసనం వెల్లడించింది.

మరోవైపు అటు కేంద్రం, ఇటు ఢిల్లీ సర్కారుపై ఢిల్లీ హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఆక్సీజన్ కొరతపై దాఖలైన పిటీషన్లపై విచారణ జరిపిన ఢిల్లీ హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ప్రాధేయపడడం, అరువు తెచ్చుకోవడం, దొంగిలించడం... ఇదా ఆక్సిజన్ కోసం చేయాల్సింది. ఆక్సీజన్‌ను సరఫరా చేయడం మీ విధి కాదా అంటూ ధర్మాసనం కేంద్రాన్ని ప్రశ్నించింది. ప్రజల ప్రాణాలు ప్రభుత్వానికి ముఖ్యం కాదా అంటూ నిలదీసింది. ఆక్సీజన్‌కు అంతరాయం లేకుండా ఇతర రాష్ట్రాల నుంచి ఢిల్లీకి నిరంతరం సరఫరా చేయాలని కోర్టు సూచించింది.

ఆక్సీజన్ కొరత తీవ్రంగా ఉందని... రోగులకు ప్రమాదకరంగా మారిందని పిటీషన్లు దాఖలయ్యాయి. ప్రతి పది రోజులకు కొవిడ్ రోగుల సంఖ్య రెట్టింపవుతోందంటూ పిటిషనర్లు ఆందోళన వ్యక్తం చేశారు. వీటిని విచారించిన కోర్టు... ప్రస్తుత పరిస్థితిని జాతీయ విపత్తుగా అభివర్ణించింది. ప్రస్తుత పరిస్థితులను చూసి షాకయ్యామంటూ ద్విసభ్య ధర్మాసనం విస్మయం వ్యక్తం చేసింది. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం మేల్కోదా... వాస్తవ పరిస్థితులను తెలుసుకోదా అంటూ ప్రశ్నించింది.

Next Story

RELATED STORIES