NCERT పుస్తకాల్లో సిలబస్‌ మార్పు.. చరిత్రను వక్రీకరించేందుకేనా?

NCERT పుస్తకాల్లో సిలబస్‌ మార్పు.. చరిత్రను వక్రీకరించేందుకేనా?

నూతన జాతీయ విద్యా విధానం ప్రకారం నేషనల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఎడ్యుకేషనల్‌ రిసెర్చ్‌ అండ్‌ ట్రైనింగ్‌ చేపడుతున్న సిలబస్‌ మార్పులు వివాదాస్పదంగా మారుతుంది. కేంద్ర సర్కార్‌చరిత్రను,వాస్తవాలను మార్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నదనే విమర్శలు వస్తున్నాయి. వివిధ తరగతులకు చెందిన పుస్తకాల్లో గత ఏడాది ఎన్సీఈఆర్టీ ప్రకటించిన సిలబస్‌ రేషనలైజేషన్‌’బుక్‌లెట్‌లో లేని పలు అంశాలను కూడా తొలగించడం హాట్‌ టాపిక్‌గా మారింది.

12వ తరగతి పొలిటికల్‌ సైన్స్‌ పాఠ్య పుస్తకం నుంచి మహాత్మాగాంధీ, హిందూ-ముస్లిం ఐక్యతకు సంబంధించిన పాఠ్యాంశాలను తొలగించింది. దేశంలో మతపరమైన పరిస్థితిపై గాంధీజీ మరణం చూపిన ప్రభావం, హిందూ-ముస్లిం ఐక్యత కోసం గాంధీజీ చేసిన కృషి, హిందూ అతివాదులను ఏవిధంగా రెచ్చగొట్టింది, ఆర్‌ఎస్‌ఎస్‌ తదితర సంస్థలను కొంతకాలం నిషేధించడం వంటివి సిలబస్‌లో మాయం అయ్యాయి.

మరోవైపు మొఘల్‌ సామ్రాజ్యం చాప్టర్లను ఎన్సీఈఆర్టీ తొలగించింది. 12వ తరగతి చరిత్ర పుస్తకంలో థీమ్స్‌ ఆఫ్‌ ఇండియన్‌ హిస్టరీ పార్ట్‌-2లో కింగ్‌ అండ్‌ క్రానికల్స్‌,ది మొఘల్‌ కోర్ట్స్‌ చాప్టర్లను తొలగించారు. 11వ తరగతి సోషియాలజీలో అండర్‌స్టాండింగ్‌ సొసైటీ’లో..మతం, వర్గం, జాతులు ప్రజలను ఏవిధంగా విడదీస్తాయి? అనేదానికి గుజరాత్‌ అల్లర్లను ఉదాహరణగా చూపిన పెరాగ్రాఫ్‌ను డిలీట్‌ చేశారు. ఎమర్జెన్సీ, ప్రచ్ఛన్న యుద్ధం, నక్సలైట్‌ ఉద్యమం తొలగించారు. 2002 మత హింసకు సంబంధించిన అంశాలను డ్రాప్‌ చేశారు.

ఇక పాఠ్యాంశాల తొలగింపుపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం చరిత్రను వక్రీకరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నదని, చరిత్రను మార్చాలనుకొనేవారు, ఆ చరిత్రలోనే కలిసిపోతారని కాంగ్రెస్‌ విమర్శించింది. బీజేపీ అధికారంలోకి వచ్చాక చరిత్రను మార్చే ప్రయత్నాలు తీవ్రమయ్యాయని సీపీఎం అంటోంది.

అయితే ఈ ఏడాది ఎలాంటి మార్పులు జరుగలేదని, గత ఏడాది జూన్‌లో సిలబస్‌ రేషనలైజేషన్‌ చేసినట్లు ఎన్సీఈఆర్టీ తెలిపింది. కంటెంట్‌ ఎక్కువగా ఉండటంతో కొన్ని పాఠ్యాంశాల్ని తొలగించామన్నారు.సబ్జెక్ట్‌ నిపుణుల కమిటీ సిఫారసు మేరకే గాంధీజీకి సంబంధించిన కొన్ని అంశాలను తొలగించామని, దీనికి గతేడాదే ఆమోదం లభించిందని ఎన్సీఈఆర్టీ తెలిపింది.దీని వెనుక ఉద్దేశపూర్వకం ఏమీ లేదని క్లారిటీ ఇచ్చింది.

Tags

Next Story