కేంద్రం, రైతులకు మధ్య జరిగిన చర్చలు అసంపూర్ణం

కేంద్రం, రైతులకు మధ్య జరిగిన చర్చలు అసంపూర్ణం
కొత్త వ్యవసాయ చట్టాలపై కేంద్ర ప్రభుత్వానికి రైతులకు మధ్య జరిగిన చర్చలు మళ్లీ అసంపూర్ణంగానే ముగిశాయి. ఇరు వర్గాల మధ్య నేటితో కలిపి 9 విడతల చర్చలు ముగిశాయి.

కొత్త వ్యవసాయ చట్టాలపై కేంద్ర ప్రభుత్వానికి రైతులకు మధ్య జరిగిన చర్చలు మళ్లీ అసంపూర్ణంగానే ముగిశాయి. ఇరు వర్గాల మధ్య నేటితో కలిపి 9 విడతల చర్చలు ముగిశాయి. అయితే ఈ 9 చర్చల్లోనూ ఇద్దరి మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. మరోసారి 10వ విడత చర్చలు జనవరి 19న జరగనున్నట్లు కేంద్రం ప్రకటించింది. చట్టాల్లోని అంశాల వారీగా మాట్లాడదామని కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు చెబుతుంటే.. వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవడం, కనీస మద్ధతు ధరపై చట్టబద్ధ హామీ ఇవ్వడం మినహా మరే డిమాండ్‌ను ఒప్పుకోమని, మరే అంశమూ చర్చించబోమని రైతులు తేల్చి చెప్తున్నారు.

సాగు చట్టాలను వెనక్కి తీసుకోవాల్సిందేనని రైతులు పట్టుబట్టగా.. అందుకు కేంద్రం ససేమిరా అనడంతో ఈసారి కూడా చర్చలు కొలిక్కిరాలేదు. దీంతో ఈ నెల 19న మధ్యాహ్నం 12గంటలకు మరోసారి సమావేశమై చర్చలు జరపాలని నిర్ణయించారు. సాగు చట్టాలను వెనక్కి తీసుకోవడంతో పాటు కనీస మద్దతు ధరను చట్టబద్ధం చేయాలంటూ 41 రైతు సంఘాల ప్రతినిధులు కేంద్రమంత్రుల బృందాన్ని కోరారు. అయితే, రైతులు లేవనెత్తుతున్న అభ్యంతరాలపై సవరణలు చేసేందుకు తామెప్పుడూ సిద్ధంగా ఉన్నట్టు కేంద్ర మంత్రులు చెప్పగా.. దీనిపై రైతు సంఘాల నేతలు అసంతృప్తి వ్యక్తంచేశారు. చట్టాలను వెనక్కి తీసుకోవడం మినహా ఎలాంటి ప్రత్యామ్నాయం లేదని, కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాల్సిందేనని తేల్చిచెప్పారు. ఇందుకు రాజకీయ పార్టీల మద్దతు కావాలంటే తాము కూడగడతామని కూడా రైతు నేతలు చెప్పారు.

హర్యానా, పంజాబ్‌ రైతులపై దర్యాప్తు ఏజెన్సీలు రకరకాల కేసులు బనాయిస్తున్న విషయాన్ని రైతు సంఘాల నేతలు కేంద్రమంత్రుల బృందం దృష్టికి తీసుకెళ్లారు. ఎన్‌ఐఏతో దాడులు చేయించడం, రైతులను ఉగ్రవాదులుగా చిత్రీకరించడం, కక్షసాధింపు చర్యలకు పాల్పడటం వంటి అంశాలపై రైతు నేతలు అసంతృప్తి వ్యక్తంచేశారు. అయితే రైతుల పట్ల తమకు సానుభూతి ఉందని కేంద్రమంత్రుల బృందం చెబుతోంది. దీంతో ఇరువురి మధ్య చర్చలు కొలిక్కి రాకపోవడంతో 19న మరోసారి చర్చలు జరపాలని నిర్ణయించారు.

ప్రభుత్వానికి తమ సమస్యలు పరిష్కరించే ఉద్దేశం లేదని ఆరోపించాయి రైతు సంఘాటు. జనవరి 26న ఢిల్లీలో పెద్ద ఎత్తున ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించి తమ సత్తా చూపించబోతున్నట్లు రైతు సంఘాలు ప్రకటించాయి. దీనికి రిహార్సల్‌గా జనవరి 7న ఢిల్లీ సరిహద్దులో ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించారు. అయితే ట్రాక్టర్ ర్యాలీపై ఢిల్లీ పోలీసులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. జనవరి 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా రైతులు ట్రాక్టర్ ర్యాలీ నిర్వహిస్తే శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందని సుప్రీంలో దాఖలు చేసిన పిటిషన్‌లో ఢిల్లీ పోలీసులు తెలిపారు. ట్రాక్టర్ ర్యాలీపై వివరణ ఇవ్వాలని రైతులను సుప్రీం కోరింది. అయితే ఎవరు ఎన్ని చెప్పినా ర్యాలీ ఆపబోమని రైతులు తేల్చి చెప్పారు.

రైతులకు మద్దతుగా ఢిల్లీలో రాహుల్, ప్రియాంక గాంధీ ర్యాలీ చేపట్టారు. కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో రైతులు చేస్తున్న ఆందోళనలకు మద్దతిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రైతుల సంఘాలతో కేంద్రం తొమ్మిదో దఫా చర్చలు జరుపుతున్న సమయంలోనే కాంగ్రెస్ ఈ ర్యాలీ చేపట్టింది. కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు రాహుల్‌, ప్రియాంక గాంధీ.

రైతులతో చర్చలు నిర్ణయాత్మకంగా జరగలేదని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ తెలిపారు. 19న మరోసారి చర్చలు జరపనున్నట్టు చెప్పారు. చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకొనేందుకు తాము సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు. చలి వాతావరణంలో రైతులు నిరసనలు తెలపడంపై తోమర్‌ ఆందోళన వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన కమిటీ పిలిచినప్పుడు తమ వైపు నుంచి హాజరవుతామని తెలిపారు. అయితే, సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన కమిటీ వద్దకు తాము వెళ్లబోమని బీకేయూ నేత రాకేశ్‌ తెలిపారు. తాము కేంద్రంతోనే చర్చలు జరుపుతామన్నారు.

Tags

Next Story