రూ.971 కోట్లతో కొత్త పార్లమెంట్ భవనం.. ప్రారంభమైన నిర్మాణ పనులు

కేంద్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నూతన పార్లమెంట్ భవన నిర్మాణ పనులు ఇవాళ ప్రారంభం కానున్నాయి. 14 మంది సభ్యుల హెరిటేజ్ కన్జర్వేటివ్ కమిటీ సెంట్రల్ విస్టా పునరాభివృద్ధి ప్రణాళికలో భాగంగా కొత్త పార్లమెంటు భవనం నిర్మాణానికి ఇటీవలే ఆమోదం తెలిపింది. ఇవాళ కొత్త పార్లమెంటు భవన నిర్మాణ కాంట్రాక్ట్ పొందిన టాటా ప్రాజెక్ట్స్ లిమిటెడ్ పనులను ప్రారంభించనుంది. 64వేల 500 చదరపు మీటర్ల పరిధిలో 971 కోట్ల రూపాయలతో కొత్త భవనం రూపుదాల్చనుంది. ప్రస్తుత భవనం కంటే ఇది 17 వేల చదరపు మీటర్లు పెద్దది. ఎలాంటి భూకంపాలకు చెక్కుచెదరని రీతిలో ఈ భవనాన్ని నిర్మిస్తున్నారు. నూతన భవనం రూపు ప్రస్తుత భవనాన్ని పోలి ఉంటుంది. గ్రౌండ్ ఫ్లోర్, మొదటి, రెండు అంతస్తులుంటాయి. ఎత్తు కూడా ప్రస్తుత భవనం అంతే ఉంటుంది.
హెచ్‌సీపీ సంస్థ డిజైన్‌ను రూపొందించగా, టాటా సంస్థ నిర్మాణం చేపడుతుంది. నిర్మాణంలో 2 వేల మంది ప్రత్యక్షంగాను, 9 వేల మంది పరోక్షంగాను పాలుపంచుకుంటారు. 200 మందికిపైగా దేశవ్యాప్తంగా ఉన్న హస్తకళాకారులు ఇందులో పాల్గొంటారు. ఒకేసారి 1,224 మంది ఎంపీలు కూర్చోవడానికి అనుగుణంగా నూతన పార్లమెంటు భవనాన్ని నిర్మిస్తున్నారు.
లోక్‌సభలో 888 మంది, రాజ్యసభలో 384 మంది కూర్చునేందుకు వీలైన సామర్థ్యంతో కొత్త భవనం నిర్మితం కానుంది. భారతజాస్వామ్య వైభవాన్ని చాటిచెప్పే ప్రత్యేక రాజ్యాంగ మందిరం.. సభపతులు, మంత్రులకు ప్రత్యేక కార్యాలయాలు, పార్లమెంటు సభ్యుల కోసం విశాలమైన లాంజ్, గ్రంథాలయం, బహుళ కమిటీల గదులు, భోజనశాలలు వంటివి ఏర్పాటు చేస్తారు. 2022 అక్టోబరు నాటికి భవన నిర్మాణం పూర్తి చేయాలన్నది లక్ష్యం. పార్లమెంటుకు కాస్త దూరంలో ఇప్పుడున్న శ్రమశక్తి భవన్ స్థానంలో ఎంపీల కోసం 2024 నాటికల్లా 40 చదరపు మీటర్ల విస్తీర్ణంతో ప్రత్యేక కార్యాలయాలు నిర్మిస్తారు. పార్లమెంటు, ఎంపీల కార్యాలయ భవనానికి మధ్య భూగర్భమార్గం ఏర్పాటు చేస్తారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com