April First Release : ఏప్రిల్ ఒకటిన మారబోతున్న రూల్స్.. మీ బ్యాంక్ అకౌంట్లో..

April First Release
ఏప్రిల్ ఒకటి నుంచి కేంద్రం కొత్త రూల్స్
కొన్ని బ్యాంకుల చెక్ బుక్ లు పనిచేయవు
బ్యాంకు డిపాజిట్లపై రెట్టింపు టీడీఎస్ తప్పదు
ఈపీఎఫ్ ఖాతాలో ఎక్కువ జమ చేస్తే.. ట్యాక్స్ తప్పదు
ఇక కంపెనీలు కూడా క్రిప్టో కరెన్సీ లెక్క చెప్పాల్సిందే
విమానం ఎక్కాలనుకుంటే.. ఇకపై ఆ ఫీజు బాదుడు
కార్లు, బైక్ లు, ఏసీల రేట్లు పెరగబోతున్నాయి
ఏప్రిల్ 1 విడుదల. ఈ టైటిల్ ను వింటే భలే ఇంట్రస్ట్ గా ఉంటుంది. కానీ దాని వెనుక అసలు సంగతి తెలిస్తే.. గుండె అదిరిపోతుంది. ఎందుకంటే. ఆ తేదీ నుంచి వివిధ రూపాల్లో ప్రజలపై బాదుడు తప్పదు. మీరు ఉపయోగించే ఏసీలు, రిఫ్రిజిరేటర్లు, టీవీల రేట్లకు రెక్కలు వస్తాయి. కార్లు, బైక్ లను కొనాలంటే అదనంగా చెల్లించుకోవాల్సిందే. కొన్ని బ్యాంకుల చెక్ బుక్ లు, పాస్ బుక్ లు పనిచేయవు. ఇలా చాలా మార్పులు ఉన్నాయి. ఆ ఛేంజస్ ఏమిటో.. వాటి వల్ల వచ్చే లాభనష్టాలు ఏమిటో తెలిస్తే.. అసలు విషయం అర్థమవుతుంది.
మీకు ఆ 7 బ్యాంకుల్లో అకౌంట్ ఉంటే.. వెంటనే వాటిపై ఓ లుక్కేయండి. ఎందుకంటే ఆ బ్యాంకుల చెక్ బుక్ లు, పాస్ బుక్ లు ఏప్రిల్ 1 నుంచి మారిపోతాయి. ఆదాయపన్ను శ్లాబులోకి వచ్చి.. మినహాయింపులను ఉపయోగించుకుని.. రిటర్న్స్ ను దాఖలు చేయనివారికి ఇకపై వడ్డింపు తప్పదు. ఈపీఎఫ్ ఖాతాలో రెండున్నర లక్షల కంటే ఎక్కువ పెట్టుబడి పెట్టినా బాదుడే. అసలిన్ని రకాలుగా వడ్డించడానికి కారణాలేంటి? వాటి నుంచి ఉపశమనం ఎలా?
ఇప్పటివరకు ఏప్రిల్ ఒకటి అంటే.. కొత్త ఆర్థిక సంవత్సరం మొదలవుతుందని మాత్రమే అందరికీ తెలుసు. ప్రభుత్వాలకు కూడా లెక్క మొదలయ్యేది ఆ రోజు నుంచే. కానీ ఈసారి మాత్రం అసలైన లెక్క మారింది. ఈ ఏడాది ఏప్రిల్ ఒకటి నుంచి కొత్త ఆర్థిక సంవత్సరంతో పాటు మరికొన్ని వడ్డింపులు, మినహాయింపులు ఉండబోతున్నాయి. ఎందుకంటే.. వినియోగదారుల సేవ కోసమే అని ప్రభుత్వాలు చెబుతున్నా.. బడ్జెట్ లో ప్రతిపాదించిన మేరకు అన్నీ మారబోయేది ఈ తేదీ నుంచే.
కేంద్ర ప్రభుత్వం బ్యాంకుల విషయంలో చాలా మార్పులు చేసింది. కొన్ని బ్యాంకులను మరికొన్నింటిలో విలీనం చేసింది. దీంతో.. ఆ పాత బ్యాంకుల చెక్ బుక్ లు ఏప్రిల్ ఒకటి నుంచి మరి పనిచేయవు. అవి ఏమేం బ్యాంకులంటే.. ఆంధ్రా బ్యాంకు, అలహాబాద్ బ్యాంక్, దేనా బ్యాంకు, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, విజయా బ్యాంకు, కార్పొరేషన్ బ్యాంక్. ఈ బ్యాంకులకు సంబంధించిన కస్టమర్లు కచ్చితంగా రెండు విషయాలను గమనించాలి. మొదటి విషయం ఏంటంటే.. ఈ బ్యాంకులకు సంబంధించిన పాస్ పుస్తకాలు ఏప్రిల్ ఒకటి నుంచి పనిచేయవు. రెండో విషయాన్ని చూస్తే.. ఈ బ్యాంకులకు చెందిన చెక్ బుక్ లు కూడా ఏప్రిల్ ఒకటి నుంచి మారబోతున్నాయి. ఈ ఏడు బ్యాంకులు.. వేరే బ్యాంకుల్లో విలీనం అవ్వడం వల్లే ఈ మార్పంతా. ఇప్పుడు ఈ బ్యాంకుల కస్టమర్లంతా.. విలీనమైన బ్యాంకులకు సంబంధించిన చెక్ పుస్తకాలను తీసుకోవాలి.
చాలామంది డబ్బులు సంపాదిస్తారు. కానీ పరిమితి దాటిన ఆదాయంపై ట్యాక్స్ చెల్లించే విషయంలో అప్రమత్తంగా ఉండరు. పైగా రిటర్న్స్ కూడా సమయానికి దాఖలు చేయనివారు ఎందరో. అందుకే ఇకపై ఇన్ కం ట్యాక్స్ రిటర్న్స్ సరైన సమయానికి చెల్లించకపోతే.. బ్యాంకు డిపాజిట్లపై మూలం వద్ద పన్ను మినహాయింపు.. అంటే టీడీఎస్.. రెట్టింపు స్థాయిలో ఉంటుందని బడ్జెట్ ప్రసంగంలోనే కేంద్రం స్పష్టంగా చెప్పింది. ఈ రూల్ కూడా ఏప్రిల్ ఒకటి నుంచి అమల్లోకి వస్తుంది. ఒకవేళ ఆదాయపన్ను శ్లాబులో లేము కదా.. మాకేం కాదులే అనుకోవద్దు. అలాంటివాళ్లు కూడా ఐటీఆర్ ను.. అంటే.. ఆదాయ పన్ను రిటర్న్స్ ను దాఖలు చేయాల్సిందే. లేకపోతే వాళ్లు కూడా రెట్టింపు టీడీఎస్ ను కట్టాల్సిందే. ఇదంతా ఎందుకంటే ఆదాయపన్ను రిటర్న్స్ ను ఎక్కువమంది దాఖలు చేసేలా చూడడానికే కేంద్రం ఇలా చేస్తోంది. దీనివల్ల పన్ను పరిధిలోకి వచ్చేవారెందరు.. రానివారెందరు.. ఎవరి ఆదాయం ఎంతుందో దానికి అర్థమవుతుంది. గత రెండేళ్లలో 50 వేల రూపాయిలు లేదా అంతకంటే ఎక్కువ టీడీఎస్, టీసీఎస్ ఉన్నవారికి నిర్దిష్ట రేటు కంటే రెట్టింపు స్థాయిలో అయినా, లేదా ఐదు శాతాన్ని కాని వసూలు చేస్తారు. ఈ రెండింటింలో ఏది ఎక్కువైతే దానినే పరిగణనలోకి తీసుకుంటారు.
ఉద్యోగులకు కాస్తయినా పొదుపు ఉండేది ఈపీఎఫ్ ఖాతా ద్వారానే. కానీ ఏప్రిల్ ఒకటి నుంచి ఉద్యోగ భవిష్య నిధి ఖాతాలో పెట్టే పెట్టుబడులు కూడా ఆదాయపన్ను నుంచి తప్పించుకోలేపు. అదెలాగో చూద్దాం. ఒక ఆర్థిక సంవత్సరంలో రెండున్నర లక్షల కంటే ఎక్కువ మొత్తాన్ని ఈపీఎఫ్ లో పెట్టుబడులు పెడితే.. దానిపై వచ్చే వడ్డీకి పన్ను తప్పదు. ఈ రెండున్నర లక్షల మొత్తాన్ని బడ్జెట్ లోనే నిర్దేశించారు. ప్రస్తుతం ఈ పన్ను మినహాయింపు పెట్టుబడులను ఐదు లక్షలకు పెంచారు. కాకపోతే ఈ పీఎఫ్ జమలో కంపెనీ వాటా ఉండకూడదన్నది రూల్. ఒకవేళ ప్రైవేటు ఉద్యోగులు ఎవరైనా సరే.. తమకు వచ్చే వడ్డీపై పన్ను ఉండకూడదనుకుంటే.. ఈపీఎఫ్, వీపీఎఫ్.. ఈ రెండింటిని కలిపి అత్యధికంగా రెండున్నర లక్షల వరకే జమ చేసుకుంటే సరిపోతుంది. మరి ప్రభుత్వ ఉద్యోగుల సంగతేంటి అనుకోవచ్చు. వాళ్లకు ఎలాగూ ప్రభుత్వం నుంచి వచ్చే వాటా ఉండదు. అందుకే వాళ్లు ఐదు లక్షల రూపాయిల వరకు జమ చేసుకున్నా.. వడ్డీపై పన్ను పడదు.
కార్లు కొనాలి. వాటిలో తిరగాలి. దానివల్ల వస్తుసేవల వినియోగం పెరుగుతుంది. ఇది వ్యాపారం వెనుకున్న సూత్రం. ఆదాయాన్ని ఆశించే ప్రభుత్వ ఆంతర్యం కూడా ఇదే. కానీ ఈ ఏప్రిల్ 1 నుంచి కార్లు, బైక్ లు, ఏసీల ధరలు పెరగబోతున్నాయి. కార్ల సంగతి పక్కన పెడితే ఏసీలు, బైక్ లు అనేవి నిత్యావసరాలుగా మారిపోయాయి. మధ్యతరగతి వారు కూడా వీటిని ఎక్కువగా ఉపయోగిస్తారు. వీటిలో కూడా బైక్ లను ఎక్కువమంది ఉపయోగిస్తారు. అలాంటి వీటి ధరలు పెరగడం అనేది మధ్యతరగతి నడ్డి విరగ్గొట్టడమే. ఇప్పటికే కరోనా ఎఫెక్ట్ తో జనవరిలో వీటి రేట్లను పెంచిన కంపెనీలు.. మరోసారి వడ్డింపు తప్పదంటున్నాయి. దీనికి కారణంగా.. అంతర్జాతీయ సరఫరా కొరతను చూపిస్తున్నాయి. కమొడిటీ, లోహాల ధరలు పెరిగాయని.. అందుకే కార్లు, బైక్ ల రేట్లు పెంచక తప్పదని సెలవిస్తున్నాయి.
టీవీలు, ఏసీలు.. ఈ రెండు చాలా ఇళ్లల్లో ఇప్పుడు కామన్. కానీ ఇప్పుడు వీటి ధరలు పెంచితే.. సామాన్యులకు అవి అందడం చాలా కష్టమవుతుంది. టీవీలు, ఏసీల ధరలు దాదాపు 3 వేల రూపాయిల నుంచి నాలుగు వేల రూపాయిల వరకు పెరగబోతున్నాయి. అదేమంటే తయారీ ఖర్చు పెరిగిందంటున్నాయి. వీటితోపాటు ఏసీలు, రిఫ్రిజిరేటర్ల ధరలను తట్టుకోవడమూ కష్టమే. ఎందుకంటే.. ఏసీల రేట్లు 1500 రూపాయిల నుంచి 2000 రూపాయిల వరకు పెరిగే అవకాశం ఉంది. ఇది నిజంగా మధ్యతరగతిపై పిడుగే. వేసవిలో ఎక్కువమంది ఏసీలను కొనుగోలు చేయడానికి ఇష్టపడతారు. కానీ ఈ వేసవికి ఆ ఏసీలు కూడా వారితో సెగలు కక్కించేట్టే ఉంది పరిస్థితి. ఇకపై ఫ్రిజ్ లో చల్లటి నీళ్లు తాగడానికి కూడా ఆలోచించాల్సిందేనన్న మాట.. పెరిగే రేట్లు సామాన్యుల గొంతు తడారిపోయేలా చేస్తుంది. వేసవి వేడికి తోడు పెరిగిన ధరలు ఏప్రిల్ ఒకటి నుంచి ఠారెత్తించనున్నాయి.
విమాన ప్రయాణం అనేది మధ్యతరగతి, సామాన్యులకు ఇప్పటికీ కలే. ఆమధ్య ఫ్లైట్ ఛార్జీలు ఆఫర్లలో తక్కువకు రావడం వల్ల చాలామంది ఒక్కసారైనా విమానం కల నెరవేర్చుకోగలిగారు. కానీ ఇప్పుడు మిగిలినవారికి ఆ ఛాన్స్ లేకుండా చేస్తున్నాయి. ఎందుకంటే మన దేశ విమానాశ్రయాల్లో ఏవియేషన్ సెక్యూరిటీ ఫీజు.. అంటే ఏఎస్ఎఫ్ వడ్డన తప్పదు. దేశీయ, అంతర్జాతీయ ప్రయాణికులపై ఏఎస్ఎఫ్ ను పెంచాలని ఇప్పటికే కేంద్రం నిర్ణయించింది. కాకపోతే ఏప్రిల్ ఒకటి నుంచి జారీ చేసే టిక్కెట్లపైనే ఇది వర్తిస్తుంది. ఎవరికి ఎంత ఛార్జీ తప్పదంటే.. దేశీయ ప్రయాణికులు అదనంగా 200 రూపాయిలను, అంతర్జాతీయ ప్రయాణికులు అదనంగా 12 డాలర్లను చెల్లించాల్సి ఉంటుంది. కాకపోతే రెండేళ్లలోపు చిన్నారులు, డిప్లొమాటిక్ పాస్ పోర్టులు ఉన్నవారు, మరికొన్ని వర్గాకు ఈ ఫీజు పెరుగుదల వర్తించదు.
చాలా మందికి క్రిప్టో కరెన్సీ గురించి తెలియదు. కానీ ఈమధ్యకాలంలో చాలామంది దాని గురించి ఆరా తీస్తున్నారు. అందుకే ప్రభుత్వం కూడా వీటిపై కొత్త రూల్స్ తెచ్చింది. ఏప్రిల్ ఒకటి నుంచి వారికి ఇబ్బందులు తప్పవు. ఎందుకంటే.. ఆ తేదీ నుంచి కంపెనీలు తమ వద్ద ఉండే క్రిప్టోకరెన్సీ వివరాలను కచ్చితంగా ఆర్థిక ఖాతాల్లో చెప్పాల్సిందే. కంపెనీకి చెందిన ఆర్థిక అంశాలను వాటాదార్లకు తెలియజేయడం ఆ కంపెనీ బాధ్యత. అందుకే ప్రభుత్వం కూడా దానిని తప్పనిసరి చేసేలా.. ఈ నిబంధనను తీసుకురావడం జరిగింది. కంపెనీలు ఆర్థిక ఫలితాలను ప్రకటించే తేదీకి ఆ సంస్థ దగ్గర ఎంత క్రిప్టో కరెన్సీ ఉందో చెప్పక తప్పదు. వాటిపై వచ్చిన లాభ, నష్టాల వివరాలను చూపించాలి. ఈ కరెన్సీ ట్రేడింగ్ కు సంబంధించి కాని, పెట్టుబడులకు సంబంధించి కాని.. ఇతరుల నుంచి డిపాజిట్లు లేదా అడ్వాన్స్ లను తీసుకున్నట్టయితే ఆ డీటైల్స్ ను కూడా కంపెనీలు చెప్పాలి. అంటే ఏ రకంగా చూసినా.. క్రిప్టో కరెన్సీ పూర్తి వివరాలను కంపెనీలు బయటపెట్టాల్సిందే.
చాలామంది ప్రతీ నెలా చెల్లించే బిల్లుల కోసం ఆటోమేటిక్ పేమెంట్ సిస్టమ్ ను యాక్టివేట్ చేసుకుంటారు. కానీ ఏప్రిల్ ఒకటి నుంచి అలా కుదరదు. ఎందుకంటే ఆన్ లైన్ లావాదేవీల ద్వారా జరిగే మోసాలను అరికట్టడానికి కేంద్రం ఈ కొత్త విధానాన్ని తీసుకువచ్చింది. ఇప్పటివరకు ఖాతాదారులు ఇచ్చే స్టాండర్డ్ ఇన్ స్ట్రక్షన్స్ అన్నీ ఏప్రిల్ ఒకటి నుంచి డీయాక్టివేట్ అవుతాయి. ఇప్పటికే బ్యాంకులు తమ కస్టమర్లకు ఈ సమాచారాన్ని తెలిపాయి. ఏప్రిల్ ఒకటి నుంచి బ్యాంకులు అందించే కొన్ని సేవలకు బిల్లులు చెల్లించాలంటే.. ఆ కంపెనీల వెబ్ సైట్స్, యాప్ ల నుంచి చెల్లించాల్సి ఉంటుంది. కాకపోతే మీరు క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డుల ద్వారా పేమెంట్ చేసుకోవచ్చు. కానీ వీటికి ఓటీపీని కచ్చితంగా ఎంటర్ చేయాలి. ఇప్పుడు ఈ ఓటీపీతోనే అసలు సమస్యంతా వస్తోంది. బ్యాంకులన్నీ ఈ రూల్ ను పాటించాలంటే.. కచ్చితంగా తమ సాఫ్ట్ వేర్ ను అప్ డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే ఓటీపీతో సమస్యలు తప్పేలా లేవు. ప్రస్తుతానికైతే.. హోమ్ లోన్స్, వెహికల్ లోన్స్, మ్యూచువల్ ఫండ్స్, ఎల్ఐసీ వంటి కొన్ని సేవలకు మాత్రమే ఆటోమేటిక్ పేమెంట్ సిస్టమ్ ఉంటుంది.
------------------------
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com