Darbhanga Blast Case : దర్బంగా పేలుళ్ల కేసులో ఛార్జ్‌షీట్ దాఖలు చేసిన NIA

Darbhanga Blast Case : దర్బంగా పేలుళ్ల కేసులో ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సి. పట్నా NIA కోర్టులో ఈ ఛార్జ్‌షీట్ దాఖలు చేసిన NIA ఐదుగురిని నిందితులుగా గుర్తించింది. మహ్మద్ నసీర్ ఖాన్, ఇమ్రాన్ మాలిక్, సలీం అహ్మద్, కఫిల్ అహ్మద్, ఇక్బాల్ అహ్మద్‌లను నిందితులుగా పేర్కొంది.
జూన్ 17న దర్బంగా రైల్వే స్టేషన్‌లో పార్సిల్ పేలుడు సంభవించింది. స్థానిక పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైన తర్వాత అదే నెల కేసు NIAకు బదిలీ అయింది. దర్యాప్తు చేపట్టిన అధికారులు పేలుళ్ల ఘటనలో లష్కరే తొయిబా పాత్ర ఉందని తేల్చారు.
పాకిస్థాన్‌లో ఉంటూ లష్కరే తొయిబా కార్యకలాపాల్లో పాల్గొంటున్న హఫీజ్ ఇక్బాల్ ఆదేశాల మేరకు రైల్లో బాంబు పేల్చేందుకు కుట్ర పన్నినట్లు NIA ఛార్జ్‌షీట్‌లో పేర్కొంది. ఇందుకోసం నసీర్‌ఖాన్ పలుసార్లు పాకిస్థాన్ వెళ్లి బాంబులు తయారు చేయడంలో శిక్షణ పొందినట్లు తెలిపింది. తర్వాత హైదరాబాద్ వచ్చి తన తమ్ముడు ఇమ్రాన్ మాలిక్‌తో కలిసి హబీబ్‌నగర్‌లో చీరల వ్యాపారం పెట్టినట్లు స్పష్టం చేసింది.
పాకిస్థాన్ నుంచి నసీర్ ఖాన్‌కు భారీగా నిధులు వచ్చినట్లు దర్యాప్తులో తేలింది. పేలుళ్ల కోసం చీరలో మూటలో బాంబు పెట్టి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు వచ్చి దర్బాంగా ఎక్స్‌ప్రెస్‌లో పార్శిల్ చేశారు. కదులుతున్న రైల్లో బాంబు పేల్చడం ద్వారా ఎక్కువ ప్రాణ నష్టం జరిగేలా చేయాలని లష్కరే తొయిబా కుట్ర పన్నినట్లు NIA అధికారులు తెలిపారు.
పేలుళ్ల తర్వాత నిందితులు నేపాల్ మీదుగా పాకిస్థాన్ పారిపోయేందుకు ప్రయత్నించారని NIA స్పష్టం చేసింది. పకడ్బందీగా నిందితులను పట్టుకున్నామని...దర్బాంగా కేసుకు సంబంధించి దర్యాప్తు కొనసాగుతుందని అధికారులు తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com