బ్యాంకుల ముందు చెత్త వేయడంపై నిర్మలా సీతారామన్ సీరియస్

బ్యాంకుల ముందు చెత్త వేయడంపై నిర్మలా సీతారామన్ సీరియస్
బ్యాంకుల ముందు చెత్త వేయడంపై కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ సీరియస్ అయ్యారు. ఏపీ రాష్ట్ర మంత్రి బుగ్గనకు ఫోన్‌ చేసి ఆరా తీశారు.

బ్యాంకుల ముందు చెత్త వేయడంపై కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ సీరియస్ అయ్యారు. ఏపీ రాష్ట్ర మంత్రి బుగ్గనకు ఫోన్‌ చేసి ఆరా తీశారు. ఏపీలో ప్రభుత్వం ప్రకటించిన సంక్షేమ పథకాలకు రుణాలు మంజూరు చేయలేదనే కారణంతో కృష్ణాజిల్లాలో బ్యాంకుల ముందు చెత్త వేశారు. విజయవాడ, మచిలీపట్నం, ఉయ్యూరులో పలు బ్యాంకుల ముందు చెత్త కుప్పలు పోశారు. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేస్తున్న వ్యవస్ధలు కావడంతో కేంద్రం దృష్టికి వెళ్లింది.

రుణాలు ఇవ్వకపోతే బ్యాంకుల ముందు చెత్త వేయిస్తారా అంటూ నిర్మలా సీతారామన్‌ బుగ్గనకు ఫోన్ చేసి సీరియస్‌ అయినట్టు తెలుస్తోంది. బ్యాంకుల ముందు చెత్త డంపింగ్‌ చేసిన ఘటనపై మంత్రి బుగ్గనతో మాట్లాడానని, తగు చర్యలకు హామీ ఇచ్చారని నిర్మలా సీతారామన్‌ కార్యాలయం కూడా ట్వీట్‌ చేసింది. చెత్త ఘటన షాక్‌కు గురిచేసిందంటూ చంద్రబాబు కూడా ట్వీట్ చేశారు.

ఇలాంటి నీచమైన పనులు రాష్ట్ర కీర్తి, పేరు ప్రతిష్టలపై ప్రభావం చూపుతాయని అన్నారు. అధికారులే బ్యాంకుల ముందు చెత్తపోసి రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి అనాగరికమైన చర్యలతో రాష్ట్రాన్ని ఎటు తీసుకెళ్తున్నారని ప్రశ్నించారు. రుణాలు ఇవ్వనందుకు నిరసనగా ఇలా చేసినట్లు ఉయ్యూరులోని ఎస్‌బీఐ గేటుకు ఏకంగా పురపాలక కమిషనర్‌ పేరుతో కాగితం అంటించారు.

అధికార పార్టీ నేతలే ఇలా బ్యాంకుల ముందు చెత్త వేయించారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. స్థానిక మున్సిపల్ సిబ్బందిపై అధికారపార్టీ నేతలే ఒత్తిడి తెచ్చి చెత్తను డంపింగ్‌ చేయించారని టీడీపీ కూడా విమర్శిస్తోంది. మరోవైపు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే చెత్త వేశామని పారిశుద్ధ్య కార్మికులు చెబుతున్నారు. బ్యాంకులు లోన్లు ఇవ్వలేకపోతే చెత్త వేయిస్తారా అని మండిపడుతున్నాయి విపక్షాలు. పథకాల పేరుతో రుణం తీసుకుంటే వడ్డీ తామే చెల్లిస్తామని ప్రభుత్వం చెప్పింది. కానీ, అధికారికంగా బ్యాంకులకు ఎటువంటి ఉత్తర్వులు వెళ్లలేదని విపక్షాలు చెబుతున్నాయి.

పైకి ఓ ప్రకటన చేసినంత మాత్రాన ప్రభుత్వ హామీ లేకుండా బ్యాంకులు లోన్లు ఎలా ఇస్తాయంటూ టీడీపీ ప్రశ్నించింది. నిజానికి బ్యాంకుల ముందు కాకుండా బీసీ నాయకుల విగ్రహాలు తీసేస్తామన్నందుకు, పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వలేకపోయినందుకు, పెన్షన్‌ పెంచుతామని చెప్పి మోసం చేసినందుకు మంత్రుల ఇళ్ల ముందు చెత్తవేయాలని టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రభుత్వ పథకాలైన పీఎం స్వానిధి, జగన్నన్న తోడు, వైస్సార్ చేయూత లోన్లు ఇవ్వనందున నిరసనగా చెత్తను వేయించినట్లు చర్చించుకుంటున్నారు. మొత్తంగా ఈ చెత్త పనితో ఏపీ ప్రభుత్వ పరువు బజారున పడిందని ప్రజలు మాట్లాడుకుంటున్నారు.

Tags

Read MoreRead Less
Next Story