ఏడోసారి సీఎంగా నితీశ్‌ నేడు ప్రమాణం.. డిప్యూటీ సీఎంగా కామేశ్వర్‌!

ఏడోసారి సీఎంగా నితీశ్‌ నేడు ప్రమాణం.. డిప్యూటీ సీఎంగా కామేశ్వర్‌!

బీహార్‌లో ఎన్‌డీఏ శాసనసభ పక్ష నేతగా నితీశ్‌ కుమార్‌ను భాగస్వామ్య పక్షాల నేతలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆదివారం జరిగిన కూటమి సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీలో బీజేపీ పక్ష నేతగా తార్‌ కిషోర్‌ ప్రసాద్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు సీనియర్‌నేత సుశీల్‌ కుమార్‌ మోదీ తెలిపారు. డిప్యూటీ సీఎంగా కామేశ్వర్‌ చౌపాల్‌ను నిర్ణయించారు. సమావేశం అనంతరం గవర్నర్‌ను కలిసిన నితీశ్‌.. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా కోరారు. నేడు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయనున్నారు. కూటమి సమావేశంలో బీజేపీ నుంచి ముఖ్యనేతలు రాజ్‌నాథ్‌ సింగ్, భూపేంద్ర యాదవ్‌, దేవేంద్ర ఫడణవీస్‌ పాల్గొన్నారు.

బీహార్‌లో జరిగిన తాజా ఎన్నికల్లో ఎన్‌డీఏ కూటమిలోని బీజేపీ 74, జనతాదళ్-యునైటెడ్‌-43, హిందుస్థానీ అవామ్‌ మోర్చా 4, విరాస్‌శీల్‌ ఇన్సాన్‌ పార్టీ-వీఐపీ 4 సీట్లు సాధించాయి. మొత్తం ఎన్‌డీఏ కూటమి 125 స్థానాల్లో విజయం సాధించింది. 2015 ఎన్నికల్లో జేడీయూ 71 స్థానాల్లో విజయం సాధించగా... ఈ సారి 43 స్థానాలే గెల్చుకుంది. ఈ సారి జేడీయూకి తక్కువ స్థానాలు వచ్చినప్పటికీ... ముఖ్యమంత్రి అభ్యర్థిగా నీతీశ్‌ కుమార్‌ ఉంటారని ఎన్‌డీఏ భాగస్వామ్యపక్షాలు ఇప్పటికే స్పష్టంచేశాయి. ఈ నేపథ్యంలోనే ఆదివారం సమావేశమైన కూటమి నేతలు.. సీఎం, స్పీకర్‌, మంత్రివర్గ కూర్పుపైనా నిర్ణయం తీసుకున్నారు.

కేంద్రమంత్రిగా, ముఖ్యమంత్రిగా వివిధ హోదాల్లో నీతీశ్‌ కుమార్‌ బిహార్‌ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్నారు. వరుసగా నాలుగోసారి.. మొత్తంగా ఏడోసారి సీఎంగా.. నితీశ్‌ కుమార్‌ సీఎంగా బాధ్యతలు చేపట్టనున్నారు.

Tags

Next Story