అతి తీవ్ర తుఫానుగా మారిన 'నివర్'

అతి తీవ్ర తుఫానుగా మారిన నివర్

బంగాళాఖాతంలో ఏర్పడిన నివర్ తుఫాను.. మరింత బలపడి అతి తీవ్ర తుఫానుగా మారి అల్లకల్లోలం సృష్టిస్తోంది. ప్రస్తుతం ఇది తమిళనాడులోని కడలూరుకు తూర్పు ఆగ్నేయ దిశగా 310 కిలో మీటర్ల దూరంలో, పుదుచ్చేరికి ఆగ్నేయంగా 320 కిలోమిటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. తీవ్ర తుపాను ప్రభావంతో గత 6 గంటలుగా గంటకు 6 కిలోమీటర్ల వేగంతో పశ్చిమ దిశగా పయనిస్తోంది. భారీ వర్షాలతో చెన్నై అలతాకుతలమవుతుంది. సముద్ర తీరం అల్లకల్లోలంగా మారింది. ఓడరేవుల్లో ఒకటో నెంబరు ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు.

నివర్ ప్రభావంతో తమిళనాడులో అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. అత్యవసర విభాగాలకు మినహా తమిళనాడులో సెలవు ప్రకటించారు. 7 జిల్లాల్లో ప్రజా రవాణా నిలిపివేశారు. అతి తీవ్ర తుపాను కారైక్కాల్, మహాబలిపురం మధ్య తీరం దాటుతుందని, తీరం దాటే సమయంలో కడలూరు, విల్లుపురం, కల్లకురిచ్చి జిల్లాల్లోనూ, పుదుచ్చేరిలోనూ మూడ్రోజుల పాటు అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. దీంతో తుపాను బాధిత ప్రాంత ప్రజలను పునరావ కేంద్రాలకు తరలించారు.

నివర్‌ తీవ్ర తుఫానును ధీటుగా ఎదుర్కొనేందుకు సర్వసన్నద్ధంగా ఉన్నట్లు కేంద్ర హోంశాఖ ప్రకటించింది. ప్రభావిత ప్రాంతాల్లో అత్యవసర సహాయక చర్యలు చేపట్టేందుకు తమిళనాడుకు 12, పుదుచ్చేరికి 3 సహాయక బృందాలను పంపింది. అదనపు అత్యవసరాల కోసం కేరళలోని త్రిస్సూర్, ఒడిసాలోని ముండ్లి కేంద్రాల వద్ద ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలను ఉంచారు. ఈ బృందాలన్నింటి వద్ద వైర్‌లెస్‌, ఉపగ్రహ సమాచార మార్పిడి సిస్టంతోపాటు.. ట్రీ కట్టర్లు, పోల్‌ కట్టర్లు కూడా సిద్ధంగా ఉంచినట్లు హోంశాఖ తెలిపింది. తుఫాను తర్వాత పరిస్థితులన్నీ సాధారణ స్థితికి వచ్చేవరకు ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు ప్రభావిత ప్రాంతాల్లోనే ఉంటాయని స్పష్టం చేసింది.

ఏపీలోని అన్ని ఓడరేవుల్లో రెండో నెంబరు ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. చిత్తూరు, నెల్లూరు జిల్లాలపై తీవ్ర తుపాను ప్రభావం పడుతుంది. బుధవారం మధ్యాహ్నం నుంచి గాలుల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ మేరకు చిత్తూరు, నెల్లూరు జిల్లాలకు రెడ్‌ మెసేజ్‌ జారీ చేశారు. ఇటు ప్రకాశం, కడప, అనంతపురం జిల్లాలకు ఆరెంజ్‌ మెసేజ్‌, గుంటూరు నుంచి విశాఖపట్నం వరకు ఉన్న జిల్లాల్లో ఎల్లో మెసేజ్‌ జారీచేశారు.Tags

Next Story