Sonia Gandhi : అసమ్మతి నేతలపై సోనియా గాంధీ ఫైర్

Sonia Gandhi : సీడబ్ల్యూసీ సమావేశం హాట్‌హాట్‌గా సాగుతోంది. అసమ్మతి నేతలపై సోనియా గాంధీ ఫైర్ అయ్యారు. పార్టీని నడిపించేందుకు సమర్థవంతమైన నాయకత్వం కావాలంటూ బహిరంగంగా అసమ్మతి తెలియజేస్తున్న జీ-23 నేతలపై పరోక్షంగా కామెంట్ చేశారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవిపై నెలకొన్న ఉత్కంఠకు తెరదించుతూ.. తానే పూర్తిస్థాయి అధ్యక్షురాలిగా ఉంటానని స్పష్టం చేశారు. కాంగ్రెస్ సంస్థాగత ఎన్నికలు వచ్చే ఏడాది సెప్టెంబర్‌లో జరుగుతాయన్న సోనియా గాంధీ అప్పటి వరకు తానే పార్టీకి అధ్యక్షురాలిగా ఉంటానని చెప్పుకొచ్చారు.
ఈ సందర్భంగా అసమ్మతి నేతలపై సీరియస్ అయ్యారు సోనియా. పార్టీ అంతర్గత విషయాలు మీడియా ద్వారా చెప్పక్కర్లేదని, ఏదైనా ఉంటే నేరుగా తనతోనే మాట్లాడాలని కుండబద్దలు కొట్టారు. అన్ని అంశాలపై స్పష్టత తీసుకురావాల్సిన సమయం వచ్చిందన్న సోనియా గాంధీ.. ఎలాంటి అంశాలైనా చర్చించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని పార్టీ నేతలకు స్పష్టం చేశారు. కాంగ్రెస్ పునరుజ్జీవనమే అంతా కోరుకుంటున్నారని, అందుకోసం నేతల మధ్య ఐక్యతతో పాటు క్రమశిక్షణ కూడా అవసరమని హితవు పలికారు. నేతలెవరైనా సరే పార్టీ ప్రయోజనాలకే తొలి ప్రాధాన్యత ఇవ్వాలని ఘాటుగా చెప్పారు.
సీడబ్ల్యూసీ సమావేశంలో పార్టీ అధ్యక్ష పదవికి ఎన్నిక, లఖీంపూర్ ఘటన, త్వరలో జరగనున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకాలు, పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలపై చర్చిస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com