చైనాకు అంగుళం భూమి కూడా వదులుకునేది లేదు : రాజ్‌నాథ్ సింగ్

చైనాకు అంగుళం భూమి కూడా వదులుకునేది లేదని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు. తూర్పు లద్ధాఖ్‌లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై ఆయన రాజ్యసభలో ప్రకటన చేశారు. లద్ధాఖ్ సరిహద్దుల్లో 9 నెలలుగా సాగుతున్న ఉద్రిక్తతలకు బలగాల ఉపసంహరణతో తెరపడనుందన్నారు. ఇందుకోసం చైనాతో కీలక ఒప్పందం చేసుకున్నామని రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు. ఇక ఈ ఒప్పందం వల్ల భారత్ ఏమీ నష్టపోలేదని ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా రాజ్‌నాథ్ సింగ్ మన సైన్యంపై ప్రశంసల జల్లు కురిపించారు. సరిహద్దుల్లో భారత జవాన్లు అత్యంత ధైర్యసాహసాలు ప్రదర్శించారని కొనియాడారు.
మన పట్టుదల చైనాకు తెలుసని రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు. సరిహద్దు సమస్యలు చర్చలతోనే పరిష్కారమవుతాయని చైనాకు పదేపదే చెప్పామన్నారు. ఇక వాస్తవాధీన రేఖను రెండు దేశాలు అంగీకరించాలని ఆయన అన్నారు. ఒంటరిపోకడలు సరికాదని డ్రాగన్‌కు అర్థమయ్యేలా వివరించామన్నారు రాజ్‌నాథ్ సింగ్. సరిహద్దు ఉద్రిక్తతలపై చైనాతో జరిగిన నిరంతర చర్చలతో పాంగాంగ్ సరస్సు ఉత్తర, దక్షిణ భాగాలపై రెండు దేశాల మధ్య ఒప్పందం కుదిరిందన్నారు. ఈ ఒప్పందంతో భారత్, చైనా దశల వారీగా సరిహద్దుల నుంచి సైన్యాన్ని ఉపసంహరిస్తాయని తెలిపారు. మిగతా సమస్యలను కూడా చర్చల ద్వారానే పరిష్కరిస్తామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
మరోవైపు పాకిస్థాన్ చైనాకు అక్రమంగా భారత భూభాగాన్ని అప్పగించిందన్నారు. అయితే దాన్ని మనం ఎప్పుడూ గుర్తించలేదన్నారు. కానీ మన దేశం నుంచి అంగుళం భూమిని కూడా వదులుకోబోమని రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com