Odisha: బిడ్డ మృతిచెందిందని నిర్ధారించిన వైద్యులు.. ఖననం చేస్తున్న సమయంలో..

Odisha: పురిటిలోనే బిడ్డ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించడంతో శ్మశానవాటికలో పాతిపెట్టేందుకు వెళ్లారు బంధువులు. ఆ సమయంలో చిన్నారి ఏడుపు కుటుంబసభ్యులను విస్మయానికి గురిచేసింది. వెంటనే తేరుకుని బిడ్డను హుటాహుటిన ఆస్పత్రికి తరలించిన అరుదైన ఘటన ఒడిశా జిల్లాలో చోటుచేసుకుంది.
జిల్లాలోని ఖండికపాడు గ్రామంలో సునియా ముండా భార్య రాయిమణి గర్భవతి. బుధవారం ఆమెకు నొప్పులు ప్రారంభమయ్యాయి. కుటుంబసభ్యులు ఆమెను మయూర్‌భంజ్‌లోని కరంజియా ఆసుపత్రికి తరలించారు. అక్కడే ఓ బిడ్డకు జన్మనిచ్చింది. అయితే పాప చనిపోయిందని వైద్యులు నిర్ధారించారు.
దీంతో చనిపోయిన శిశువును చూసేందుకు కుటుంబసభ్యులకు మనస్కరించలేదు. దాంతో ఆసుపత్రి సిబ్బంది ప్యాక్ చేసి ఇచ్చిన బిడ్డను అలాగే శ్మశానవాటికకు తీసుకెళ్లారు. గొయ్యిలో పూడ్చేందుకు సిద్ధమవుతుండగా, ఒక్కసారిగా చనిపోయిందనుకున్న పసికందు ఏడ్చింది.
బంధువులు చిన్నారిని బయటకు తీసి ఆస్పత్రికి పరుగుపెట్టారు. బతికుండగానే మరణించిందని చెబుతారా అని చిన్నారి కుటుంబసభ్యులు, పెద్ద సంఖ్యలో గ్రామస్తులు, బంధువులు ఆస్పత్రి వద్దకు చేరుకుని ఆందోళనకు దిగారు. వైద్యులు నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ ఘటనపై ఆస్పత్రి యాజమాన్యం తీవ్రంగా స్పందించింది. విచారణకు ఆదేశించింది. అయితే కొనఊపిరితో ఉన్న శిశువు చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తెలుస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com