మరింత ఉద్ధృతంగా రైతు సంఘాల ఆందోళనలు!

ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల సంఘాల ఆందోళన ఉధృతంగా కొనసాగుతోంది. వేలాది రైతులు మకాం వేసిన సింఘూ, ఘాజీపూర్, టిక్రీ సరిహద్దుల్లో జన ప్రవాహం రోజురోజుకు పెరుగుతోంది. ముఖ్యంగా ఘాజీపూర్‌లో రాకేశ్ తికాయత్ నేతృత్వంలో నిరసనకు పెద్ద ఎత్తున రైతులు కదిలివస్తున్నారు. తికాయత్‌కు మద్దతుగా జాట్‌లు తీర్మానం చేసిన తరువాత పెద్దఎత్తున తరలారు.
బాఘ్‌పట్, మీరట్, బిజ్నోర్, ముజఫర్‌నగర్, ఇతర పశ్చిమ యూపీ జిల్లాల నుంచీ వస్తున్నారు. దీంతో ఢిల్లీ నుంచి యూపీకి వెళ్లే జాతీయ రహదారి-24ను పూర్తిగా మూసివేశారు. ఫిబ్రవరి 2 నాటికి యూపీ, హరియాణ, పంజాబ్, రాజస్థాన్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున రైతులు చేరుకోనున్నారు. తమ ఉద్యమం శాంతియుతంగానే కొనసాగుతుందన్నారు. ప్రభుత్వం తమను చర్చలకు పిలిస్తే తప్పక వెళతామని పేర్కొన్నారు. సింఘూ నుంచి ఆందోళన ఘాజీపూర్‌కు చేరింది.
మరోవైపు పార్లమెంట్ సమావేశాలు జరుగుతుండటంతో కేంద్రం అప్రమత్తమైంది. సరిహద్దుల నుంచి రైతులను ఖాళీ చేయాలని హెచ్చరించింది. అయితే రైతులు మాత్రం వెనక్కి తగ్గేది లేదంటున్నారు. నోటీసులు, కేసులకు భయపడేది లేదంటున్నారు రైతులు. చట్టాల రద్దు వరకు ఆందోళను విరమించేది లేదని సంయుక్త కిసాన్ మోర్చా ప్రకటించింది. ఘాజీపూర్ ఖాళీ చేయాలంటూ.. అల్టిమేటం జారీ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు రైతు సంఘాల నేతలు.
ఆందోళన ప్రాంతాన్ని ఖాళీ చేసేందుకు నిరాకరిస్తున్నారు భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేష్ తికాయత్. రైతులపై దాడి చేయవద్దని కన్నీటి పర్యంతమయ్యారు. మూడు చట్టాలను రద్దు చేసేవరకు ఘాజీపూర్ ఖాళీ చేయబోమని స్పష్టం చేశారు. బుల్లెట్లనైనా ఎదుర్కొంటాం కానీ.. శాంతియుతంగా తమ ఆందోళన కొనసాగిస్తామని స్పష్టం చేశారు. బలవంతంగా ఖాళీ చేయాలని చూస్తే ఉరి వేసుకుంటానని హెచ్చరించారు రాకేష్ తికాయత్.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com