సాగు చట్టాలపై రైతులు చేస్తున్న ఆందోళనపై ఇవాళ రాజ్యసభలో సుదీర్ఘ చర్చ

సాగు చట్టాలపై రైతులు చేస్తున్న ఆందోళనపై ఇవాళ రాజ్యసభలో సుదీర్ఘ చర్చ జరగనుంది. ఈ అంశంపై 15 గంటలపాటు చర్చించాలని ప్రభుత్వం, విపక్షాల మధ్య అంగీకారం కుదిరింది. రైతు ఆందోళనలపై చర్చించడానికి సమయాన్ని పెంచాలంటూ విపక్షాలు డిమాండ్ చేయడంతో ముందుగా కేటాయించిన 10 గంటల సమయాన్ని 15 గంటలకు పెంచారు. రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా రైతుల ఆందోళనలపై చర్చించాలని నిర్ణయించారు.
కరోనా ప్రొటోకాల్ కారణంగా రాజ్యసభ రోజుకు 5 గంటలపాటు మాత్రమే సమావేశం అవుతుంది. రైతుల ఆందోళనపై చర్చించడానికి సమయాన్ని కేటాయించడం కోసం గత రెండు రోజుల ప్రశ్నోత్తరాల సమయాన్ని, నిన్నటి జీరో అవర్‌ను, ఇవాళ జరగాల్సిన ప్రైవేట్ మెంబర్స్ బిజినెస్ సమయాన్ని ఎత్తేస్తున్నట్లు రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు ప్రకటించారు.
కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త సాగు చట్టాలు, రైతుల ఆందోళనపై పార్లమెంట్‌లో చర్చ జరగాల్సిందేనని విపక్షాలు పట్టుబట్టి కూర్చున్నాయి. సభలో రెండురోజుల పాటు తీవ్ర గందరగోళం నెలకొంది. దీంతో కేంద్రం దిగొచ్చింది. రైతుల ఆందోళనపై చర్చించడానికి సిద్ధమంటూ ప్రకటించింది. రాజ్యసభలో 15 గంటల పాటు చర్చించేందుకు ప్రభుత్వం, ప్రతిపక్షాల మధ్య పరస్పరం అంగీకారం కుదిరింది. దీంతో ఈ అంశంపై సుధీర్ఘంగా చర్చ జరిగే అవకాశముంది.
కొత్తసాగు చట్టాల్లో సవరణలు తేవాలని ప్రతిపాదిస్తూ ఆర్‌ఎస్పీ ఎంపీ ప్రేమచంద్రన్ కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్‌కు ప్రివిలేజ్ నోటీసును అందజేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠకు పోకుండా, మూడు వివాదాస్పద సాగు చట్టాలను వెంటనే రద్దు చేయాలని కాంగ్రెస్ పక్షనేత గులాంనబీ ఆజాద్ డిమాండ్ చేశారు. రైతుల ఆందోళనలపై చర్చలకు తాము సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.
రైతులను శత్రువులుగా చూడొద్దంటూ సమాజ్‌వాదీ పార్టీ సైతం మండిపడింది. అయితే, రైతుల సమస్యలపై పరిష్కరించేందుకు.. తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని బీజేపీ స్టేట్‌మెంట్ ఇచ్చింది. రైతుల ఆందోళలను మరో షాన్‌బాగ్ ఘటనగా మార్చొద్దంటూ విపక్షాలకు విజ్ఞప్తి చేసింది. అమెరికా, బ్రిటన్, కెనడా సహా ఏ దేశం కూడా కొత్త సాగు చట్టాలపై రైతులు చేస్తున్న ఆందోళనలకు మద్దతు పలకలేదని విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి మురళీధరన్ అన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com