పార్లమెంట్‌ సమావేశాల్ని బహిష్కరించాలని విపక్షాల యోచన..!

పార్లమెంట్‌ సమావేశాల్ని బహిష్కరించాలని విపక్షాల యోచన..!
X
Pegasus Issue in Parliament: పెగాసస్‌ నిఘా అంశంపై చర్చకు కేంద్ర ప్రభుత్వం విముఖత

Pegasus Issue in Parliament: పెగాసస్‌ నిఘా అంశంపై చర్చకు కేంద్ర ప్రభుత్వం విముఖత వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో విపక్షాలు ఏకమవుతున్నాయి. రోజూ పార్లమెంట్‌ ఉభయ సభల్ని స్తంభింపచేస్తున్న ప్రతిపక్షాలు... కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ... మొత్తం పార్లమెంట్‌ సమావేశాలనే బహిష్కరించనున్నట్టు తెలుస్తోంది. ప్రతిపక్షాల్ని ఐక్యం చేసేందుకు కాంగ్రెస్‌ ముఖ్యనేత రాహుల్‌ గాంధీ చొరవ తీసుకుంటున్నారు. ఇదే ఎజెండాగా ఇవాళ సమావేశం కానున్నారు. కాన్‌స్టిట్యూషనల్‌ క్లబ్‌లో జరిగే సమావేశానికి హాజరు కావాలంటూ 14 విపక్ష పార్టీల ఎంపీలు, ఫ్లోర్‌ లీడర్లకు ఆహ్వానాలు పంపారు. గతంలో కాంగ్రెస్ నిర్వహించిన సమావేశాలకు తృణమూల్ కాంగ్రెస్‌ హాజరు కాలేదు. కానీ ఈ సారి హాజరవుతామని టీఎంసీ వర్గాలు తెలిపాయి.

బీజేపీ ప్రభుత్వ విధానాలను పార్లమెంటు వేదికగా దేశ ప్రజలకు తెలియచేయాలన్నదే సమావేశంలో ప్రధాన ఎజెండాగా కనబడుతోంది. పెగాసస్‌, ధరల పెరుగుదల, కొత్త వ్యవసాయ చట్టాలతో పాటు పలు ప్రజా సమస్యలపై చర్చించేందుకు సభలో అధికార పక్షం అవకాశం కల్పించడం లేదని విపక్షాలు మండిపడుతున్నారు. రోజూ వాయిదా తీర్మానాలు ఇస్తున్నా.... చర్చకు ప్రభుత్వం ఒప్పుకోనందున... ఉభయ సభల్లో రోజూ పెద్దగా చర్చలేవీ జరగడం లేదు. విపక్ష పార్టీలన్నీ కలిసి అధికార పక్షాన్ని ఇరుకున పెట్టాలన్న లక్ష్యంతో ఉమ్మడి వ్యూహాన్ని సిద్ధం చేస్తున్నాయి. సమావేశం తర్వాత విపక్ష ఎంపీలంతా పార్లమెంటు వరకు నిరసన ర్యాలీ నిర్వహించనున్నారు.

కాంగ్రెస్‌ ముఖ్యనేత రాహుల్‌ గాంధీతో పాటు వివిధ ప్రతిపక్ష పార్టీల నేతలు, రచయితలు, మేధావులు, మానవ హక్కుల కార్యకర్తలు, వారి కుటుంబ సభ్యులపై పెగాసస్‌ స్పై వేర్‌ ద్వారా నిఘా ఉచ్చు బిగించారని వార్తా కథనాలు రావడం సంచలనంగా మారింది. ఈ వ్యవహారంపై చర్చించాలంటూ విపక్షాలు జూలై 19 నుంచి పార్లమెంట్‌ ఉభయ సభలను స్తంభింపచేస్తున్నాయి. ఇక ఇప్పుడు... కేంద్రంపై ఉమ్మడి పోరుకు సిద్ధమవుతున్నాయి.

Tags

Next Story