నిరుద్యోగులకు శుభవార్త.. అనలిటిక్స్, డేటా సైన్స్ విభాగాల్లో 93,500 ఉద్యోగాలు..

ఇంజనీరింగ్ చదివినా ఉద్యోగం రావడం లేదని ఆందోళన చెందకుండా ఏ రంగంలో అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి, ఏ కోర్సులు నేర్చుకోవాలి అనేదాని మీద ఒక అవగాహన ఉండడం నేటి యువతకు ఎంతైనా అవసరం. ఇటీవల నిర్వహించిన ఓ అధ్యయనం ప్రకారం దేశంలో అనలిటిక్స్, డేటా సైన్స్ విభాగంలో 93,500 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని తేల్చింది. ఈ విభాగాలకు సంబంధించిన కోర్సులు నేర్చుకుని ఉద్యోగాలకు ప్రయత్నించే వారికి అవకాశాలు రానున్నాయి.
దేశంలో ఇతర నగరాలతో పోల్చితే బెగళూరులో ఈ విభాగాల్లో ఉద్యోగావకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ ఒక్క నగరంలోనే 23 శాతం ఉద్యోగాలు ఈ రంగానికి సంబంధించినవి ఉన్నాయి. తరువాతి స్థానాల్లో ఢిల్లీ, ముంబయి రాష్ట్రాలు ఉన్నాయి. హైదరాబాద్, పూణె నగరాల్లో గత సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది ఉద్యోగాల నిష్పత్తిలో స్వల్ప వృద్ధిని సాధించాయి. ఫార్మా రంగం అనలిటిక్స్ ఉద్యోగాల నిష్పత్తిలో 16.3 శాతానికి పెరిగింది. గత సంవత్సరంతో పోలిస్తే మొత్తం 3.9 శాతం పెరిగింది.
కరోనా వైరస్ కోసం టీకాలు, ఇతర మందులను అభివృద్ధి చేయడంపై దృష్టి పెట్టడం దీనికి కారణమని అధ్యయనం వెల్లడించింది. ఆక్సెంచర్, ఎంఫసిస్, కాగ్నిజెంట్, క్యాప్ జెమినీ, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, ఐబీఎం ఇండియా, డెల్, హెచ్ సీఎల్ తదితర ప్రముఖ కంపెనీల్లో డేటా సైన్స్ విభాగంలో అత్యధిక ఓపెనింగ్స్ ఉండే అవకాశం ఉంది. భారతదేశంలో డేటా సైన్స్ నిపుణుల సగటు జీతం 2020 లో సంవత్సరానికి రూ.9.5 లక్షలు అని అధ్యయనం పేర్కొంది. అనుభవం ఉన్న వారికి అధిక ప్రాధాన్యత ఉంటుంది. వారి నైపుణ్యం, వారు కంపెనీలో నిర్వహించే రోల్ ఆధారంగా లక్షల్లో ప్యాకేజీలు అందిస్తున్నాయి కొన్ని కంపెనీలు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com