పార్లమెంట్‌లో రెండోరోజు సేమ్ సీన్ రిపీట్

పార్లమెంట్‌లో సేమ్ సీన్ రిపీట్ అయింది. రెండోరోజు కూడా ధరల పెంపుపై ఉభయసభలు దద్దరిల్లాయి. అధికార, విపక్షాల మాటల మంటలతో అట్టుడికగా.. ఉభయసభల్లో వాయిదాల పర్వం కొనసాగింది. ఉదయం లోక్‌సభ ప్రారంభం కాగానే.. దేశంలో పెట్రోల్, డీజీల్, గ్యాస్ ధరల పెరగుదలపై ప్రతిపక్షాలు చర్చకు పట్టుబడ్డాయి. ధరలను తగ్గించాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. విపక్ష సభ్యుల నినాదాలతో సభ హోరెత్తింది. ప్రతిపక్షాల నిరసనల మధ్యే లోక్‌సభలో ప్రశ్నోత్తరాలు ప్రారంభించారు స్పీకర్. అయితే విపక్ష సభ్యులు వెల్‌లోకి దూసుకొచ్చి ఆందోళన చేపట్టారు. స్పీకర్ వారించినా ప్రతిపక్షాలు వెనక్కి తగ్గలేదు. ధరల పెంపుపై సమగ్ర చర్చ జరగాలని.. మోదీ ప్రభుత్వం దేశ ప్రజలకు సమాధానం చెప్పాల్సిందే అని పట్టుబట్టాయి. పరిస్థితి సద్దుమణగకపోవడంతో స్పీకర్ సభను గంటపాటు వాయిదా వేశారు. అటు రాజ్యసభలోనూ ఇదే గందరగోళం నెలకొంది.
ధరల పెంపే ఏకైక ఎజెండాగా తీసుకున్న ప్రతిపక్షాలు.. పెట్రోల్, డీజీల్, గ్యాస్ ధరలపై కచ్చితంగా చర్చ జరపాలంటూ సభలో డిమాండ్ చేశాయి. ఎంత వారించినా విపక్ష సభ్యులు వినకపోవడంతో స్పీకర్ మరోసారి సభను గంటపాటు వాయిదా వేశారు. వాయిదా అనంతరం తిరిగి ప్రారంభమైనా.. నిరసనలు కొనసాగడంతో ఉభయసభలు మళ్లీ మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడ్డాయి.
గత ఆరేళ్లలో మోదీ సర్కారు.. పెట్రోల్, డీజీల్, గ్యాస్, పన్నులు, సెస్సుల రూపంలో కనీసం 21 లక్షల కోట్ల రూపాయలు రాబట్టుకుందని సభలో ప్రతిపక్షాలు లేవనెత్తాయి. పెంచిన ధరలతో వచ్చిన డబ్బంతా ఎక్కడకు వెళ్లిందనే దానిపై సభలో సమగ్రంగా చర్చ జరగాలని కాంగ్రెస్‌తో పాటు విపక్ష సభ్యులు పట్టుబట్టారు. అయితే చర్చకు ప్రభుత్వం అంగీకరించలేదు. దీంతో లోక్‌సభ, రాజ్యసభ మొదట స్వల్ప వ్యవధితో రెండుసార్లు చొప్పున.. ఆ తర్వాత మంగళవారానికి వాయిదా పడ్డాయి. పెట్రోల్, డీజీల్ ధరల అంశాన్ని ప్రస్తావించడానికి రాజ్యసభలో తొలుత ఛైర్మన్ వెంకయ్యనాయుడు అనుమతించినా.. చర్చకు మాత్రం అంగీకరించలేదు. రెండో విడత పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు సోమవారం ప్రారంభం కాగా.. ప్రతిపక్షాల ఆందోళనతో మొదటిరోజూ ఎలాంటి చర్చ లేకుండానే ఉభయ సభలు వాయిదా పడ్డాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com