రెండో రోజూ దద్దరిల్లిన పార్లమెంట్..పెగాసస్ స్పైవేర్ అంశంపై చర్చకు విపక్షాల పట్టు

Parliament
Parliament Monsoon Session 2021: పార్లమెంట్‌లో రెండో రోజూ సేమ్ సీన్ రిపీట్ అయింది. పెగాసస్ వ్యవహారం ఉభయసభలనూ కుదిపేసింది.. ఫోన్ల హ్యాకింగ్.. పెగాసస్ స్పైవేర్ అంశాలపై చర్చించాల్సిందేనంటూ పలు పార్టీలు వాయిదా తీర్మానాలు ఇచ్చాయి. సభ ప్రారంభమైన వెంటనే విపక్షసభ్యులు నినాదాలతో హోరెత్తించారు. దీంతో ఉభయసభల్లోనూ వాయిదాల పర్వం కొనసాగింది. వాయిదాల పర్వం మధ్యలోనే సభ్యులు అడిగిన పలు ప్రశ్నలకు కేంద్ర ప్రభుత్వం సమాధానాలు ఇచ్చింది. రేపు సెలవు కావడంతో ఉభయసభలూ గురువారానికి వాయిదా పడ్డాయి.
కొవిడ్ కట్టడికి కోసం భారీ ఎత్తున నిధులు కేటాయించమని కేంద్రం వెల్లడించింది. జాతీయ ఆరోగ్య మిషన్ కింద కేటాయించిన నిధులతో పాటు కొవిడ్ నివారణ, మౌలిక సదుపాయాల కల్పనకు 40వేల కోట్లను ఆమోదించినట్లు కేంద్ర సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ లోక్‌సభలో వెల్లడించారు. అలాగే జులై 16 నాటికి ఔషధ సంస్థ భారత్ బయోటెక్ నుంచి 5.45 కోట్ల కొవాగ్జిన్ డోసులను అందుకున్నట్లు తెలిపారు. జులై చివరినాటికి 8 కోట్ల డోసులు సరఫరా చేసేలా బయోటెక్‌కు ఆర్డర్ ఇచ్చామని చెప్పారు. ఇక, ప్రస్తుతం దేశంలో మరో నాలుగు కొవిడ్ టీకాలు క్లినికల్ ట్రయల్స్‌లో ఉన్నాయని, ఒకటి ప్రి-క్లినికల్ ట్రయల్స్ దశలో ఉందని రాజ్యసభలో వెల్లడించింది కేంద్రం.
ప్రతిపక్షాలు పెగాసస్ స్నూపింగ్ ఆరోపణలతో పార్లమెంటులో రసాభాస సృష్టించడంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ప్రధాని పాల్గొన్నారు. ప్రతిపక్షాలు చెప్తున్న అబద్ధాలను తిప్పికొట్టేందుకు అసలు నిజాలను ప్రజలకు తెలియజేయాలని కోరారు. ముఖ్యంగా కాంగ్రెస్ చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని పార్టీ ఎంపీలకు సూచించారు.
కరోనా సంక్షోభం రాజకీయాంశం కాదని.. మానవాళి ఎదుర్కొంటున్న సమస్య అని మోదీ పేర్కొన్నారు. ఇలాంటి సమయంలో దేశంలో ఏ ఒక్కరూ ఆకలితో అలమటించకుండా ప్రభుత్వం భరోసా ఇచ్చిందని పునరుద్ఘాటించారు. ఎన్నో ఏళ్ల సుదీర్ఘ సమయం తర్వాత ఇలాంటి మహమ్మారిని ప్రపంచం చవిచూస్తోందని అన్నారు..ఇలాంటి విపత్కర సమయంలో ప్రతిపక్ష నాయకుల తీరును ప్రశ్నించారు ప్రధాని. కరోనా విషయంలో పార్లమెంట్ ఉభయసభల్లో చర్చించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని.. కానీ, ప్రతిపక్ష పార్టీలు బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నాయని ప్రధాని అసంతృప్తి వ్యక్తం చేశారు. కరోనా కట్టడి చర్యలు, వ్యాక్సిన్ విధానంపై ప్రతిపక్షాలకు దీటుగా సమాధానం ఇవ్వాలని బీజేపీ ఎంపీలను ఆదేశించారు మోదీ.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com