తమిళనాడులో ప్రశాంతంగా కొనసాగుతున్న పోలింగ్

తమిళనాడులో ప్రశాంతంగా కొనసాగుతున్న పోలింగ్
మధ్యాహ్నం 2 గంటల వరకు అసెంబ్లీ స్థానాల్లో 45 శాతం పోలింగ్ నమోదు కాగా.. కన్యాకుమారి లోక్‌సభ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికల్లో 51.16శాతం నమోదైంది.

తమిళనాడులో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఓటు వేసేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరుతున్నారు. మధ్యాహ్నం 2 గంటల వరకు అసెంబ్లీ స్థానాల్లో 45 శాతం పోలింగ్ నమోదు కాగా.. కన్యాకుమారి లోక్‌సభ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికల్లో 51.16శాతం నమోదైంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు భద్రతా ఏర్పాట్లు చేశారు. మొత్తం 234 స్థానాలకు పోలింగ్ కొనసాగుతుండగా.. 3 వేల 998 మంది అభ్యర్థలు ఎన్నికల బరిలో ఉన్నారు. తమిళనాడు రాష్ట్రవ్యాప్తంగా 6.28 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. అధికారంలోకి వచ్చేందుకు అధికార, ప్రతిపక్ష పార్టీలు ఓటర్లకు భారీగా ఉచిత హామీలు ప్రకటించాయి.

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటేసేందుకు కోలీవుడ్ పోటెత్తింది. మక్కల్ నీధి మయ్యం అధినేత, నటుడు కమల్ హాసన్ తన కుమార్తెలతో కలిసి చెన్నైలోని హైస్కూల్‌ పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. అటు రజనీకాంత్ థౌజండ్ లైట్స్ అసెంబ్లీ నియోజకవర్గంలోని స్టెల్లామేరీస్ పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. వీరితో పాటు నటి ఖుష్బూ, నటులు సిద్ధార్థ్, విజయ్.. ఇలా కోలీవుడ్ నటీనటులు తమ ఓటు హక్కును వినియోగించుకోగా.. నటి త్రిష, నటులు విక్రమ్, జయం రవి ఓటు వేశారు.

ఎన్నికల్లో పలు పార్టీలు ఓటర్లకు డబ్బులు పంచుతున్నాయంటూ మక్కల్ నీధి మయ్యం అధినేత, నటుడు కమల్ హాసన్ ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశారు. ఇతర పార్టీల నేతలు ముందుగానే టోకెన్లు అందిస్తూ ప్రజలకు ప్రలోభాలు పెడుతున్నారని ఆరోపించారు. అటు థౌజండ్ లైట్స్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి, సినీ నటి ఖుష్బూపై డీఎంకే నేతలు ఈసీకి ఫిర్యాదు చేశారు. ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించి బీజేపీ జెండాతో ఉన్న వాహనంలో ఓటు వేసేందుకు ఖుష్బూ.. పోలింగ్ కేంద్రానికి వెళ్లారని ఆరోపించారు.

అమ్మ మక్కల్ మున్నెట్ర కజిగమ్ పార్టీ ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్ దామోదరపురంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. కుటుంబసభ్యులతో కలిసి ఆయన ఓటు వేశారు. అధికార అన్నాడీంఎకేకి ఓటమి భయం పట్టుకుందని.. తమ పార్టీ అభ్యర్థులతో బేరసారాలు సాగిస్తోందని దినకరన్ ఆరోపించారు. కొవెల్పట్టి నియోజకవర్గం ప్రజలు తనను 50 వేల ఓట్ల మెజార్టీతో గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు.

Tags

Read MoreRead Less
Next Story