Tulsi Gowda: అడవి బిడ్డ తులసిని వరించిన 'పద్మశ్రీ'.. రాష్ట్రపతి చేతుల మీదుగా..

Tulsi Gowda: (tv5news,in)
Tulsi Gowda: "ఎన్‌సైక్లోపీడియా ఆఫ్ ఫారెస్ట్"గా పేరొందిన తులసి గౌడకు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ భారతదేశపు నాల్గవ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మశ్రీని ప్రదానం చేశారు. 2020 సంవత్సరానికి గాను 61 మంది పద్మశ్రీ అవార్డు గ్రహీతలలో ఆమె ఒకరు.
రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ 73 మందికి పద్మ అవార్డులను ప్రదానం చేశారు. కొందరికి మరణానంతరం ఈ అవార్డు వరించింది. పద్మశ్రీ అవార్డు వరించిన ఓ ముఖ్య వ్యక్తి తులసి.. అక్షరం ముక్క రాదు.. అయినా అడవిలోని మొక్కల గురించి అనర్గళంగా మాట్లాడేస్తుంది.. ఏ మొక్క ఎంత కాలం జీవిస్తుంది.. ఏ ఎరువులు వేస్తే ఏపుగా పెరుగుతుంది అన్న విషయాలని ఆమె మైండ్‌లో నిక్షిప్తమై ఉన్నాయి.
కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లాలోని ఓ గ్రామంలో హలక్కీ గిరిజన కుటుంబంలో జన్మించిన తులసి గౌడ తన జీవితకాలంలో 30,000 మొక్కలు నాటారు.
76 ఏళ్ల గౌడ రాష్ట్రపతి భవన్‌లో పాదరక్షలు లేకుండా, తమ సాంప్రదాయ దుస్తుల్లో వచ్చి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ చేతుల మీదుగా అవార్డును అందుకున్నారు. ఆమె సింప్లిసిటీకి సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రపతి భవన్‌లోని చారిత్రాత్మక దర్బార్ హాల్‌లో ఆమె చెప్పులు లేకుండా నడిచి, రాష్ట్రపతి నుండి అవార్డును స్వీకరించడానికి వెళ్లే ముందు, ప్రధాని నరేంద్ర మోడీకి అభివాదం చేసేందుకు కొద్దిసేపు ఆగిపోయింది.
రాష్ట్రపతి కోవింద్ ట్వీట్ చేస్తూ, "వైవిధ్యమైన జాతుల మొక్కలు మరియు మూలికలపై ఆమెకున్న అపారమైన పరిజ్ఞానం కారణంగా ఎన్‌సైక్లోపీడియా ఆఫ్ ఫారెస్ట్‌గా ప్రసిద్ధి చెందిన సామాజిక కార్యకర్త తులసి గౌడ'' ను పద్మ శ్రీకి ఎంపిక చేయడం సంతోష దాయకం అని పేర్కొన్నారు.
నిరుపేద కుటుంబంలో పుట్టిన తులసి గౌడ రెండేళ్ల వయసులో తండ్రిని కోల్పోయింది. చాలా చిన్న పిల్లగా ఉన్నప్పుడే తులసి స్థానిక నర్సరీలో తన తల్లితో కలిసి పనిచేయడం ప్రారంభించింది. ఎప్పుడూ పాఠశాలకు వెళ్లలేదు. 12 ఏళ్ల వయసులోనే వివాహం చేసుకుంది. కానీ కొంత కాలానికే భర్త మరణంతో కృంగిపోయింది. అడవిలోని మొక్కలే ఆమెకు అండా దండా. మొక్కలని ప్రేమిస్తూ, వాటిని సంరక్షిస్తూ తన బాధని మర్చిపోయేది.
తులసి గౌడ కర్ణాటక అటవీ శాఖలో వాలంటీర్‌గా చేరారు. పర్యావరణ పరిరక్షణలో ఆమె అంకితభావం, నిబద్ధతను గమనించిన ప్రభుత్వం ఆమెకు శాశ్వత ఉద్యోగం ఇచ్చింది. ఉద్యోగం నుంచి రిటైర్మెంట్ తీసుకున్న మొక్కల పెంపకాన్ని కొనసాగిస్తోంది. మొక్కల గురించి తనకు ఉన్న జ్ఞానాన్ని యువతతో పంచుకుంటుంది. తద్వారా పర్యావరణాన్ని పరిరక్షించాలనే సందేశాన్ని ముందుకు తీసుకువెళుతోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com