జమ్ముకాశ్మీర్‌లో డ్రోన్ దాడి ఘటనపై కేంద్రం సీరియస్..!

జమ్ముకాశ్మీర్‌లో భారత వైమానిక స్థావరంపై గత ఆదివారం జరిగిన డ్రోన్ దాడి ఘటనపై కేంద్ర ప్రభుత్వం సమీక్షించింది. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన ఈ ఉన్నతస్థాయి సమావేశంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఎన్ఐఏ అధికారులు పాల్గొన్నారు. కశ్మీర్ పర్యటన నుంచి ఢిల్లీ చేరుకున్న రాజ్‌నాథ్.. జమ్ములో డ్రోన్ దాడి ఘటనలో ఏం జరిగిందనేది ప్రధానికి వివరించారు. వరుసగా మూడో రోజు కశ్మీర్‌లో డ్రోన్ చక్కర్లు కొట్టడం కలకలం రేపడంతో అప్రమత్రమైన కేంద్రం.. ఈ ఘటనపై దర్యాప్తును ఎన్ఐఏకి అప్పగించింది.
కేంద్ర ప్రభుత్వం ఆదేశాలతో రంగంలోకి దిగిన ఎన్ఐఏ అధికారులు.. జమ్మూ ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌పై జరిగిన దాడిపై విచారణను వేగవంతం చేశారు. ఈ కేసులో ఇప్పటి వరకు ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. ఐఏఎఫ్ చీఫ్ మార్షల్ బదౌరియా జరుగుతున్న పరిణామాలపై ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు డ్రోన్ పేలుళ్లలో ఆర్డీఎక్స్ లేదా టీఎన్‌టీ బాంబులను ఉపయోగించి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సరిహద్దుల నుంచే ఈ డ్రోన్లను నియంత్రించి ఉండొచ్చని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అంతేకాదు.. ఈ దాడిలో స్థానికుల హస్తం ఉందా..? అనే కోణంలోనూ దర్యాప్తు సాగుతున్నట్లు తెలుస్తోంది. అటు జమ్మూ కశ్మీర్ పోలీస్ విభాగం సైతం పేలుళ్లపై దర్యాప్తు చేపడుతోంది.
ఇదిలా ఉంటే.. జమ్మూలోని మిలటరీ క్యాంప్‌లో మరో రెండు డ్రోన్లు కనిపించాయి. కలుచక్‌లోని మిలటరీ స్థావరం వద్ద రెండు డ్రోన్లు కనిపించడంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. వెంటనే అలర్ట్ అయిన జవాన్లు.. డ్రోన్లపై కాల్పులు జరిపారు. అంతకుముందు ఆదివారం తెల్లవారుజామున కూడా జమ్మూలోని ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌పై ఐదు నిమిషాల వ్యవధిలోనే రెండు డ్రోన్లు వచ్చి బాంబులు వేశాయి. జమ్మూలోని ఆర్మీ క్యాంపులే లక్ష్యంగా వరుస ఘటనలు జరుగుతుండంతో.. భద్రతా దళాలు రెప్పవాల్చకుండా గగనతలంపై నిఘా పెడుతున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com