Vande Bharat Express: తొలి వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించిన ప్రధాని..
Vande Bharat Express: దక్షిణాదిన తొలి వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రధాని మోదీ ప్రారంభించారు. మైసూరు-బెంగళూరు-చెన్నై మధ్య నడిచే ఈ రైలును ఇవాళ జెండా ఊపి ప్రారంభించారు ప్రధాని మోదీ. ఈ ఉదయం బెంగళూరులోని హెచ్‌ఏఎల్ ఎయిర్‌బేస్‌కు చేరుకున్న ప్రధానిమోదీకి.. కర్ణాటక గవర్నర్ థావర్‌చంద్ గహ్లోత్, సీఎం బసవరాజ్ బొమ్మై, కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషీ తదితరులు స్వాగతం పలికారు. ఆ తర్వాత మోదీ.. వందే భారత్ ఎక్స్‌ప్రెస్, భారత్ గౌరవ్ కాశీ దర్శన్ రైలును ప్రారంభించారు.
కేఎస్సార్ రైల్వే స్టేషన్‌లో ఈ వందే భారత్ రైలును మోదీ జెండా ఊపి ప్రారంభించారు. ఈ రైలు బెంగళూరు మీదుగా మైసూరు, చెన్నైని కలుపుతూ నడుస్తుంది. దేశంలోనే ఇది ఐదో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు. దీంతో పాటు భారత్ గౌరవ్ కాశీ దర్శన్ రైలును కూడా ప్రధాని ప్రారంభించారు. ఇది యాత్రికుల కోసం తీసుకొచ్చిన రైలు. ఎనిమిది రోజుల టూర్ ప్యాకేజీ ఉండే ఈ రైలులో వెళ్లి వారణాసి, అయోధ్య, ప్రయాగ్‌రాజ్ వంటి పవిత్ర స్థలాలను దర్శించుకోవచ్చు.
అటు మోదీ.. ప్రముఖ కవి కనకదాస జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి నివాళులర్పించారు. ఆ తర్వాత మహర్షి వాల్మికి విగ్రహాన్ని సందర్శించి అంజలి ఘటించారు. ఈ పర్యటనలో భాగంగా ప్రధాని.. బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో రూ.5వేల కోట్లతో నిర్మించిన టెర్మినల్-2ను ప్రారంభించారు. 108 అడుగుల ఎత్తయిన నాద ప్రభు కెంపెగౌడ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కంచారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com