Narendra Modi : కాశీ విశ్వనాథ్ ఆలయ నిర్మాణ కార్మికులతో మోదీ సహపంక్తి భోజనం

Narendra Modi :  కాశీ విశ్వనాథ్ ఆలయ నిర్మాణ కార్మికులతో మోదీ సహపంక్తి భోజనం
X
కేంద్రం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాశీ విశ్వనాథ్‌ కారిడార్‌ ప్రాజెక్టును ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలకు అంకింతం చేశారు

Narendra Modi : కేంద్రం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాశీ విశ్వనాథ్‌ కారిడార్‌ ప్రాజెక్టును ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలకు అంకింతం చేశారు. గంగా ఘాట్‌లను అనుసంధానించే కాశీ విశ్వనాథ్ కారిడార్ ప్రాజెక్ట్ కోసం 400 కోట్లు ఖర్చుచేశారు. 5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలోని ప్రాజెక్టులో నిర్మించిన 23 భవనాలను కూడా ప్రధాని మోదీ ప్రారంభించారు. 2019లో ఈ కారిడార్‌ ప్రాజెక్టుకు మోదీ శంకుస్థాపన చేయగా.. రెండేళ్లలో పూర్తి చేశారు. ఈ ప్రాజెక్ట్ నిర్మిస్తున్న క్రమంలో చుట్టుపక్కల బయటపడ్డ 40 పురాతన ఆలయాలను కూడా పునరుద్ధరించి సుందరీకరించారు. ఈ సందర్భంగా వారణాసి కారిడార్‌ నిర్మాణ పనుల్లో నిమగ్నమైన కార్మికులను ప్రధాని అభినందించారు. వారితో కొద్దిసేపు ముచ్చటించారు.

కారిడార్‌ ప్రారంభించిన తర్వాత ప్రధాని మోదీ మాట్లాడుతూ... కొత్త చరిత్రను సృష్టించామని, కాశీ భారత సాంస్కృతిక రాజధాని అన్నారు. కొత్త భారతదేశం దాని సంస్కృతి గురించి గర్విస్తోందని, దాని సామర్థ్యంపై కూడా విశ్వాసం ఉందని పేర్కొన్నారు. నవభారతంలో విరాసత్‌, వికాస్‌ రెండూ ఉన్నాయన్నారు. ఇది ప్రాచీన, ఆధునిక సంస్కృతుల మేళవింపుగా అభివర్ణించారు. అంతకు ముందు వారణాసి చేరుకున్నప్రధాని మోదీకి సీఎం యోగి ఆదిత్యనాథ్ స్వాగతం పలికారు. అక్కడి నుంచి కాలభైరవ ఆలయానికి చేరుకున్న ప్రధాని.. కాలభైరవుని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. నాగహారతి పట్టి కాలభైరవుని ఆశీర్వాదం పొందారు. ఆ తరువాత గంగానదిలో బోటులో విహరించారు. కారిడార్ పనులు, గంగా ఘాట్లను కలిపే ప్రాజెక్టును పర్యవేక్షించారు.

కాశీ విశ్వేశ్వరునికి స్వయంగా ప్రత్యేక పూజలు చేశారు ప్రధాని మోదీ. కాషాయ వస్త్రాలు ధరించి గంగానదికి ప్రత్యేక పూజలు చేశారు. ఆ తరువాత గంగా నది నుంచి తీసుకెళ్లిన జలంతో కాశీ విశ్వనాథునికి అభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ పూజారులు శాస్త్రోక్తంగా రుద్రాభిషేకం నిర్వహించారు. గర్భగుడిలో మోదీ చేత పండితులు అభిషేకం చేయించారు. ఇక ఆలయ పరిసరాల్లో డమరుక స్వాగతం ఆకట్టుకుంది. కాశీ విశ్వనాథ ఆలయంలో పారిశుద్ధ్య కార్మికులపై ప్రధాని మోదీ పూలవర్షం కురిపించారు. ప్రతి ఒక్క కార్మికుడిపై పూలు చల్లేందుకు ఆ ప్రాంగణమంతా కలియతిరిగారు. ఈ సందర్భంగా కొంతమంది కార్మికులతో మోదీ ఆప్యాయంగా పలుకరించి, ముచ్చటించారు. వారితో కలిసి ఫోటో దిగారు.

కాశీ విశ్వనాథ్‌ ధామ్‌ ప్రాజెక్ట్‌ను ప్రజలకు అంకితం చేసిన తరువాత.. కారులోనే విశ్వనాథ ఆలయం దారిలో సర్వాంగసుందరంగా తీర్చిదిద్దిన ఆలయాలు, వీధులను పర్యవేక్షించారు. కారిడార్‌ నిర్మాణ కార్మికులతో కలిసి భోజనం చేశారు. ప్రధాని మోదీ కాశీ పర్యటనను వీక్షించేందుకు దేశవ్యాప్తంగా 51 ప్రదేశాల్లో ప్రత్యేక ఎల్‌ఈడీ స్క్రీన్లు ఏర్పాట్లు చేశారు.

Tags

Next Story