సొంత నియోజక వర్గం వారణాసిలో పర్యటించిన ప్రధాని మోదీ..!

తన సొంత నియోజకవర్గమైన వారణాసిలో ప్రధాని మోదీ పర్యటించారు. ఈసందర్భంగా పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. భారీస్థాయిలో నిర్మితమైన రుద్రాక్ష్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ అండ్ కన్వెన్షన్ సెంటర్ ను మోదీ ప్రారంభించారు. వారణాసిలో రుద్రాక్ష్ కేంద్రాన్ని ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు ప్రధాని. జపాన్ సాయంతో.. ఉన్నత కళానైపుణ్యంతో ఈ కేంద్రాన్ని నిర్మించినట్టు తెలిపారు మోడీ. వారణాసిలోని ఈ రుద్రాక్ష్ కన్వెన్షన్ సెంటర్ సదస్సులు, సమావేశాలు నిర్వహించుకునేందుకు పర్యాటకులను, వ్యాపారవేత్తలను ఆకర్షిస్తుందని తెలిపారు. భారత్, జపాన్ స్నేహ బంధానికి ఈ కన్వెన్షన్ సెంటర్ ఓ నిదర్శనమన్నారు. ఇది భారతదేశ ఆధ్మాత్మిక నగరం వారణాసికి తాము ఇస్తున్న కానుక అని అన్నారు.
కాగా కరోనా వైరస్ కట్టడిలో యూపీ ప్రభుత్వం సమర్థంగా పోరాడిందన్నారు మోదీ. దేశంలో అత్యధిక జనాభా కలిగిన ఈ రాష్ట్రం మహమ్మారిని కట్టడి చేసిన తీరు ప్రశంసనీయమని కొనియాడారు. కరోనా వారియర్లకు, ఈ క్లిష్ట సమయంలో సహకరించిన ప్రతి ఒక్కరికీ ప్రధాని కృతజ్ఞతలు తెలిపారు. అలాగే దేశంలో అత్యధిక టీకాలు పంపిణీ చేసిన రాష్ట్రంగా యూపీ నిలిచిందన్నారు. అందరికీ టీకా అందించాలనే కేంద్ర ప్రభుత్వ లక్ష్యం దిశగా ఈ రాష్ట్రం ముందుకెళ్తోంది అని ప్రధాని అన్నారు. అంతేకాకుండా కాశీ నగరం త్వరలో మెడికల్ హబ్‌గా మారనుందని చెప్పారు. ఇక నుంచి వైద్యసేవల కోసం దిల్లీ, ముంబయి వంటి నగరాలకు వెళ్లాల్సిన అవసరం ఉండదని, అన్నీ ఇక్కడే అందుబాటులోకి వస్తాయని తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com