ప్రజల్ని ఎట్టి పరిస్థితుల్లో భయభ్రాంతులకు గురిచేయవద్దు : మోదీ

ప్రజల్ని ఎట్టి పరిస్థితుల్లో భయభ్రాంతులకు గురిచేయవద్దు : మోదీ
వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ముఖ్యమంత్రులతో కరోనా తాజా పరిస్థితులు, వ్యాక్సినేషన్‌ కొనసాగుతున్న తీరును సమీక్షించారు మోదీ.

కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తున్న నేపథ్యంలో.. దేశప్రజలు క్రియాశీలకంగా ఉండాలని కోరారు ప్రధాని మోదీ. అవసరమైన చోట్ల మైక్రో కంటైయిన్మెంట్‌ జోన్లను ఏర్పాటు చేసుకోవాలన్నారు. ప్రజలను ఎట్టిపరిస్థితుల్లోనూ భయభ్రాంతులకు గురిచేయద్దని, అలాంటి వాతావరణాన్ని సృష్టించవద్దని కోరారు. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ముఖ్యమంత్రులతో కరోనా తాజా పరిస్థితులు, వైరస్‌ నియంత్రణ, వ్యాక్సినేషన్‌ కొనసాగుతున్న తీరును సమీక్షించారు మోదీ. ఈ సమావేశానికి ఛత్తీస్‌గఢ్‌, పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రులు భూపేశ్‌ భగేల్‌, మమతా బెనర్జీ గైర్హాజరయ్యారు.

గతేడాది కొవిడ్‌ ఉద్ధృతి సమయంలోనూ పలుమార్లు రాష్ట్రాల సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన మోదీ.. టీకా ప్రారంభానికి ముందు ఈ ఏడాది జనవరిలోనూ సీఎంలతో వర్చువల్‌గా మాట్లాడారు. ఇటీవల మహారాష్ట్ర సహా కొన్ని రాష్ట్రాల్లో కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు మరోసారి సమీక్షించారు. గత కొంతకాలంగా కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. 80శాతానికి పైగా కేసులు ఆరు రాష్ట్రాల్లోనే ఉంటున్నాయి. 60శాతం కేసులు ఒక్క మహారాష్ట్రలోనే ఉండగా.. తమిళనాడు, కేరళ, పంజాబ్‌, కర్ణాటక, గుజరాత్‌లోనూ కేసులు నానాటికీ పెరుగుతున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.


Tags

Read MoreRead Less
Next Story