కొత్త వ్యవసాయ చట్టాలతో రైతులకు నష్టం జరగదు: మోదీ

కొత్త వ్యవసాయ చట్టాలతో రైతులకు నష్టం జరగదు: మోదీ
కొత్త వ్యవసాయ చట్టాల వల్ల రైతులకు నష్టం జరిగే ప్రసక్తే లేదని ప్రధాని నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. ఒప్పంద వ్యవసాయంపై కొందరు అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించారు.

కొత్త వ్యవసాయ చట్టాల వల్ల రైతులకు నష్టం జరిగే ప్రసక్తే లేదని ప్రధాని నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. ఒప్పంద వ్యవసాయంపై కొందరు అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించారు. తమ పాలనలో దళారీ వ్యవస్థకు చోటు లేదని వ్యాఖ్యానించారు. రైతుల జీవితాలతో ఆడుకోవద్దని విజ్ఞప్తి చేశారు. మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయీ వ్యవసాయ సంస్కరణలకు ఆద్యుడని తెలిపారు. 'కిసాన్‌ కల్యాణ్‌ సమ్మేళన్‌' పేరిట మధ్యప్రదేశ్‌లో జరిగిన కార్యక్రమంలో మోదీ వర్చవల్‌గా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా సాగు చట్టాలను వ్యతిరేకిస్తున్న విపక్షాలపై మోదీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

రైతు చట్టాలపై తొలుత రైతులకు కొన్ని ఆందోళనలు ఉండేవని మోదీ అన్నారు. రాజకీయ పార్టీలు మధ్యలో ప్రవేశించి సంబంధంలేని డిమాండ్లను వాటిలో చేర్చారని విమర్శించారు. ప్రజలు తిరస్కరించిన నేతలు ప్రచారం కోసం పాకులాడుతున్నారని ధ్వజమెత్తారు. భూ కబ్జాల పేరిట వార్తల్లో నిలిచిన వ్యక్తులు.. రైతుల భూమిపై ఆందోళన వ్యక్తం చేయడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. సైద్ధాంతికంగా విభేదించే పార్టీలతో సైతం చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు.

గత ప్రభుత్వాల విధానాల వల్ల 80శాతం మంది పేద రైతులు మరింత పేదరికంలోకి కూరుకుపోయారని మోదీ తెలిపారు. అందువల్లే వ్యవసాయ రంగంలో సంస్కరణలు చేపట్టాల్సి వస్తోందని అన్నారు. తమ హయాంలో కనీస మద్దతు ధరను అనేక పంటలకు విస్తరించామని తెలిపారు. ఫలితంగా రికార్డు స్థాయిలో రైతులకు మేలు జరిగిందని అన్నారు. గ్రామాల్లోని రైతుల జీవనం మరింత మెరుగ్గా మార్చేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. అంతకుముందు ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి పథకం ద్వారా రైతులకు పెట్టుబడి సాయం 18వేల కోట్లు విడుదల చేశారు.

Tags

Next Story