PM Modi: జియోస్పేషియల్ ఇన్ఫర్మేషన్ కాంగ్రెస్ సదస్సుకు హైదరాబాద్ రానున్న ప్రధాని మోదీ..

ప్రధాని మోదీ... రేపు హైదరాబాద్‌కు రానున్నారు. నొవాటెల్ వేదికగా ప్రపంచ స్థాయి సదస్సు ఇవాళ్టి నుంచి జరిగనుంది. యూఎన్ వరల్డ్ జియోస్పేషియల్ ఇన్ఫర్మేషన్ కాంగ్రెస్ సదస్సుకు రేపు ప్రధాని మోదీ హాజరుకానున్నారు. ఈ సదస్సులో 120 దేశాలకు చెందిన 2 వేల మందికి పైగా ప్రతినిధులు హాజరుకానున్నారు. ఐదు రోజుల పాటు ఈ సదస్సు జరగనుంది. సమీకృత జియోస్పేషియల్ఇన్ఫర్మేషన్ మేనేజ్‌మెంట్, దాని సామర్థ్యాల అభివృద్ధి, పటిష్టతకు సంబంధించిన సమస్యలను చర్చించనున్నారు. రేపు సదస్సును ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగిస్తారు.
ఈ సదస్సులో స్థిరమైన అభివృద్ధి, సామాజిక శ్రేయస్సును పెంపొందించడంపై చర్చ జరగనుంది. అలాగే పర్యావరణం, వాతావరణ సవాళ్లను పరిష్కరించడం, డిజిటల్ పరివర్తనంపై వివిధ దేశాల ప్రతినిధులు చర్చించనున్నారు. సాంకేతిక అభివృద్ధిని స్వీకరించడం, అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థను ప్రేరేపించడం కోసం సమగ్ర భౌగోళిక సమాచారం యొక్క విలువను తెలియజేయడం వంటి అంశాలు ఈ సదస్సు హైలైట్ చేయనుంది.
గ్రామ కమ్యూనిటీలను జియోస్పేషియల్ సేవలతో అనుసంధానించే జియోస్పేషియల్ చౌపాల్ చొరవను ఈ సదస్సులో ప్రదర్శిస్తారు అని కేంద్రం తెలిపింది. భారతదేశ జియోస్పేషియల్ ఎకానమీ 2025 నాటికి 12.8 శాతం వృద్ధి రేటుతో 63 వేల 100 కోట్లకు చేరుకుంటుందని కేంద్రం అంచనా. ఉత్పాదకతను పెంపొందించడం, స్థిరమైన మౌలిక సదుపాయాల ప్రణాళిక, వ్యవసాయ రంగానికి సహాయం చేయడం ద్వారా జియోస్పేషియల్ టెక్నాలజీ సామాజిక ఆర్థిక అభివృద్ధిలో కీలకంగా మారిందని కేంద్రం తెలిపింది. గ్రామాల్లోని రెవెన్యూ భూములను మ్యాప్ చేసే జియోస్పేషియల్ డేటాను ఉపయోగించడం ద్వారా సాధారణ పౌరులకు అధికారం కల్పించేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలపై ఈ సదస్సులో కేంద్రం ప్రస్తావించనుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com