అతి పెద్ద అటల్ టన్నెల్‌ను ప్రారంభించనున్న మోదీ

అతి పెద్ద అటల్ టన్నెల్‌ను ప్రారంభించనున్న మోదీ
X

హిమాలయ పర్వత శ్రేణుల్లో నిర్మించిన అతి పెద్ద అటల్ టన్నెల్‌ను శనివారం ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. ఇందుకోసం హిమాచల్‌ ప్రదేశ్‌లోని రోహ్‌తంగ్‌లో భారీగా ఏర్పాట్లు చేశారు. 9.02 కిలోమీటర్ల పొడవైన హైవే సొరంగానికి మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి పేరు పెట్టారు. గుర్రపు డెక్క ఆకారంలో నిర్మించిన ఈ టన్నెల్ వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయి. అన్నిరకాల వాతావరణ పరిస్థితులను తట్టుకునేలా దీన్ని మనాలీ-లహౌల్-స్పీతీ లోయలను కలుపుతూ నిర్మించారు. టన్నెల్ నిర్మాణంతో ఈ మార్గంలో ఏడాది పొడవునా ప్రయాణించే వీలు కలిగింది. ఎందుకంటే గతంలో మంచు కురిసే సమయంలో దాదాపు 6 నెలలపాటు ఈ లోయకు వెళ్లడానికి రహదారి సౌకర్యం ఉండేదికాదు. ఈ టన్నెల్ గుండా వాహనాలు గంటకు 80 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేలా లేటెస్ట్ టెక్నాలజీతో నిర్మాణం చేపట్టారు.

సొరంగం లోపల 8 మీటర్ల వెడల్పయిన రహదారి ఉంది. దీనివల్ల రోజుకు 3 వేల కార్లు, 1,500 ట్రక్కులు ప్రయాణించే వీలుంది. టన్నెల్ లోపల అత్యాధునిక అగ్నిమాపక వ్యవస్థ, లైటింగ్, పర్యవేక్షక వ్యవస్థలను ఏర్పాటు చేశారు. ప్రతి 150 మీటర్లకు టెలిఫోన్ కనెక్షన్ అందుబాటులో ఉంటుంది. ఎమర్జెన్సీ సమయంలో దీన్ని ఉపయోగించుకోవచ్చు. ప్రతి 60 మీటర్లకు అగ్నిమాపక వ్యవస్థ రెడీగా ఉంటుంది. ప్రతి 250 మీటర్లకు ఒక సీసీటీవీ ఆటో ఇన్సిడెంట్ డిటెక్షన్ సిస్టమ్ నెలకొల్పారు. ఇక అటల్ టన్నెల్ వల్ల మనాలి - లేహ్ మధ్య దూరం 46 కిలోమీటర్లు తగ్గుతుంది. అంతేకాదు నాలుగైదు గంటల ప్రయాణ సమయం కూడా కలిసొస్తుంది.

Tags

Next Story