కాక రేపుతున్న బెంగాల్ రాజకీయాలు.. నేటి నుంచి ప్రచారంలోకి ప్రధాని మోదీ.!

బెంగాల్ రాజకీయాలు దేశవ్యాప్తంగా కాక రేపుతున్నాయి. ఈసారి ఎలాగైనా బెంగాల్ గడ్డ మీద పాగా వేయాలనుకుంటున్న బీజేపీ ప్రచారాన్ని ముమ్మరం చేసింది. ఇప్పటికే ఆ పార్టీ అగ్రనేతలు ప్రచార బరిలోకి దిగారు. ఇక ప్రధాని మోదీ కూడా నేటి నుంచి రంగంలోకి దిగనున్నారు. కోల్ కత్తాలో జరగనున్న భారీ ర్యాలీలో ఆయన పాల్గొననున్నారు. అనంతరం బహిరంగ సభలో పాల్గొని కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. 8 దశల్లో జరగనున్న బెంగాల్ ఎన్నికల్లో మోదీ మొత్తం 20 ర్యాలీలు నిర్వహించనున్నారు.
294 నియోజకవర్గాలకు గాను తొలి, రెండవ విడత అభ్యర్థుల జాబితాను బీజేపీ ప్రకటించింది. 57 మంది అభ్యర్థులతో కూడిన జాబితాను బీజేపీ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ విడుదల చేశారు. టీఎంసీపై ఇటీవల తిరుగుబాటు బావుటా ఎగురవేసి బీజేపీలో చేరిన సువేందు అధికారిని నందిగ్రామ్ నుంచి బీజేపీ పోటీలోకి దింపింది. నంద్రిగ్రామ్ నుంచి మమతా బెనర్జీ కూడా పోటీ చేస్తుండడంతో ఈ పోటీ రసవత్తరంగా మారింది.
అటు అధికార టీఎంసీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. టీఎంసీ నేత దినేష్ బజాజ్ తాజాగా పార్టీ నుంచి రాజీనామా చేసి బీజేపీలో చేరనున్నట్టు ప్రకటించారు. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల పేర్లను టీఎంసీ ప్రకటించిన కొద్ది సేపటికే ఆయన తన నిర్ణయాన్ని ప్రకటించారు. ఇక శనివారం ఉదయమే టీఎంసీ రాజ్యసభ ఎంపీ దినేష్ త్రివేది కూడా కాషాయ తీర్థం పుచ్చుకున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com