PM Modi Gurudwara Tour: గురుద్వారాలో ప్రధాని మోదీ ప్రార్థనలు!

PM Modi Gurudwara Tour
దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సిక్కుల తొమ్మిదో గురువు తేజ్ బహదూర్‌కు నివాళులు అర్పించారు. తేజ్ బహదూర్ పుణ్య వర్ధంతిని పురస్కరించుకుని ఢిల్లీ రకాబ్ గంజ్ గురుద్వారాలోని ఆయన సమాధిని దర్శించుకున్న మోదీ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా మోదీ గురుద్వారాను సందర్శించడం విశేషం. ఆయనతో పాటు ఆంతరంగిక భద్రత అధికారులు తప్ప ఎవరూ లేరు.
కనీసం పోలీసులకు, స్థానిక అధికారులకు కూడా సమాచారం అందించలేదు. ఎలాంటి ట్రాఫిక్ ఆంక్షలు లేకుండా ఓ సాధారణ పౌరుడిలానే మోదీ గురుద్వారాను సందర్శించారు. గురు తేజ్ బహదూర్ సమాధిని దర్శించుకోవడం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని.. ఆయన చేసిన త్యాగం ఎప్పటికీ మరువలేనిదని ఆయన ప్రవచించిన ఆదర్శాలను పాటించడమే ఆయనకు నిజమైన నివాళి అని మోదీ ట్విట్టర్‌లో తెలిపారు.
అయితే మోదీ గురుద్వారా పర్యటనపై ఆసక్తి నెలకొంది. కేంద్రం ప్రవేశపెట్టిన నూతన చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి. ఇందులో పాల్గొంటున్న వారిలో 90 శాతం మంది సిక్కులే. ఈ నేపథ్యంలో వారిని సంతుష్టులను చేసేందుకే మోదీ.. ఇలా గురుద్వారాను సందర్శించారా అని రాజకీయ వర్గాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి.
అయితే బీజేపీ వర్గాలు మాత్రం ఈ పర్యటనకు ఎలాంటి రాజకీయ ప్రాధాన్యతను ఆపాదించవద్దని అంటున్నాయి. గతంలోనూ మోదీ అనేకసార్లు గురుద్వారాలను సందర్శించిన సందర్భాలను ప్రస్తావిస్తున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com