Political Day Out : అమ్మతో పాటూ అసెంబ్లీకి.. కేరింతలతో మురిసిన శాసనసభ

Maharastra
Political Day Out : అమ్మతో పాటూ అసెంబ్లీకి.. కేరింతలతో మురిసిన శాసనసభ
చిన్ని కన్నయ్య రాకతో మురిసిన మహారాష్ట్ర శాసనసభ, పదివారాల చిన్నారితో సభకు విచ్చేసిన ఎన్సీపీ ఎమ్మెల్యే సరోజ్ అహిరే.

ఇంట గెలిచి రచ్చ గెలవాలన్నారు. ఎమ్మెల్యేగా ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకు రావడమే కాదు సమస్తం తానే అయిన తన చిట్టి తండ్రికి తల్లిగా బాధ్యతలు నిర్వహించడం కూడా ముఖ్యమేనంటున్నారు ఎన్సీపీ ఎమ్మెల్యే సరోజ్ అహిరే వాఘ్. అందుకే శాసనసభ శీతాకాల సమావేశాలకు పదివారాల తన కుమారుడితో సహా హాజరై చరిత్ర సృష్టించారు. సరోజ్ కు సహాయంగా ఆమె భర్త డా. ప్రవీణ్ వాఘ్, అత్తగారు సైతం చిన్నారి సంరక్షణ కోసం నాగ్ పూర్ రాగా, రెండున్నర నెలల ప్రశంసక్ తన పొలిటికల్ డేఅవుట్ కు రెడీ అయిపోయాడు.



నిండైన చీరకట్టులో హుందాగా కనిపిస్తున్న సరోజ్, చిన్నారి ప్రశంసక్ తో కలసి శాసనసభలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా మీడియాతో ముచ్చటించిన సరోజ్ 'తన బిడ్డకు ఆకలి వేసినప్పుడు పాలు ఇచ్చేందుకే చిన్నారితో పాటూ అసెంబ్లీకి వచ్చాన'ని తెలిపారు. అయితే మహిళా నేతలు పిల్లలకు పాలించ్చేందుకు సరైన సదుపాయాలు లేవని ఆమె వాపోయారు. కనీసం క్రష్ కూడా లేదని అన్నారు. ప్రభుత్వం ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని తమ మైనర్ చిన్నారులను శాసనసభకు తీసుకువచ్చే విధంగా తగిన ఏర్పాట్లు చేయాలని సూచించారు.


ప్రస్తుతం నాసిక్ లోని డియోలాలీ నియోజకవర్గానికి నాయకత్వం వహిస్తున్న సరోజ్ తన కుటుంబంతో పాటూ ముంబై-నాగ్ పూర్ సూపర్ ఎక్స్ ప్రెస్ వే మీదుగా సుమారు 500 కి.మి. ప్రయాణించి శాసనసభకు చేరుకున్నారు. ఇక శీతాకాల సమావేశాలు జరిగినన్ని రోజులూ ప్రశంసక్ అమ్మతో పాటూ రోజు అసెంబ్లీకి వస్తూనే ఉంటాడు.


పసికందులతో మహిళా నేతలు అసెంబ్లీకి హాజరైన సందర్భాలు ఇప్పటికే ఐరాపా, ఆస్ట్రేలియా, అరబ్ దేశాల్లో అప్పుడప్పుడూ చోటు చేసుకుంటూనే ఉన్నాయి. ప్రజా సంక్షేమానికి మాతృత్వం అడ్డు కాబోదని ఎందరో మహిళామణులు నిరూపిస్తూనే ఉన్నారు. వారి అడుగుజాడల్లోనే నడుస్తున్న సరోజ్ మరింత మందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు.

Tags

Next Story