మమత సర్కారుకు సవాల్ విసురుతున్న మోదీ, అమిత్

బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. రాజకీయ పార్టీల ప్రచారం ముమ్మరమైంది. బీజేపీ జాతీయ నేతలు వరుస పర్యటనలతో మమత సర్కారుకు సవాల్ విసురుతున్నారు. ప్రధాని మోదీ, హోంశాఖ మంత్రి అమిత్‌షా పలు విడతలుగా పర్యటించారు. తాజాగా నరేంద్రమోదీ మరోసారి బెంగాల్‌లో సభపెట్టి.. శ్రేణుల్లో ఉత్సాహం నింపారు. బెంగాల్ అభివృద్ధిని మమత సర్కారు అడ్డుకుంటోందని విమర్శలు గుప్పించారు.
బెంగాల్ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. మౌలిక సదుపాయాల కల్పనకు కేంద్రం సిద్ధంగా ఉందని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో... హౌరా బహిరంగ సభలో పాల్గొన్న మోదీ.... ప్రజలపై వరాలు కురిపించారు. గతంలో గ్యాస్ కనెక్షన్లు ఇవ్వడానికి వచ్చిన తాను.. ఇప్పుడు రైల్వే ప్రాజెక్టులు ప్రకటించడానికి వచ్చానని అన్నారు. రైల్వేలు, మెట్రో అనుసంధానికి ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు. ఇలాంటి అభివృద్ధి పనులు గతంలోనే జరగాల్సి ఉన్నా.. జరగలేదని అన్నారు. ఇంకా ఆలస్యం చేయకుండా... కావల్సిన నిధులు విడుదల చేస్తున్నామని మోదీ ప్రకటించారు.
కేంద్రం ప్రకటించిన పథకాలు బెంగాల్ ప్రజలకు అందకుండా మమతా బెనర్జీ ప్రభుత్వం అడ్డుకుంటోందని మోదీ ఆరోపించారు. పేదలు, రైతులకు కేంద్రం నేరుగా బ్యాంకు ఖాతాల్లోకి డబ్బులు వేస్తోందని తెలిపారు. టీఎంసీ ప్రభుత్వం వ్యవస్థీకృత దోపిడీ చేస్తోందని.. అందుకే తృణమూల్ నేతలు సంపన్నులుగా మారుతున్నారని విమర్శించారు. ప్రజలు మాత్రం పేదలుగానే ఉండిపోతున్నారని అన్నారు. బెంగాల్‌లో బీజేపీ అధికారంలోకి వస్తే అవినీతి రహిత పాలన అందిస్తామని హామీ ఇచ్చారు. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. హౌరా సభకు ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొనడంపై ప్రధాని హర్షం వ్యక్తంచేశారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారు అనేందుకు ప్రజల ఉత్సాహమే నిదర్శనమని అన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com