బెంగాల్‌ పాలిటిక్స్‌లో ట్విస్టుల మీద ట్విస్టులు

బెంగాల్‌ పాలిటిక్స్‌లో ట్విస్టుల మీద ట్విస్టులు
బెంగాల్‌ పోల్‌ పాలిటిక్స్‌లో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి.

బెంగాల్‌ పోల్‌ పాలిటిక్స్‌లో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయిన సీఎం మమత ప్రచారంలో పాల్గొనేందుకు సిద్ధమవుతున్నారు.. వీల్‌ చైర్ నుంచే ప్రచారానికి వెళ్తారనే ప్రచారం జరుగుతోంది. అటు ఈ పంచాయితీ కేంద్ర ఎన్నికల సంఘం దగ్గరకు చేరింది. మమతా బెనర్జీపై జరిగినది ముమ్మాటికీ దాడేనంటూ ఆధారాలను సీఈసీ సునీల్‌ అరోరాకు సమర్పించింది. టీఎంసీ చేస్తున్న ప్రచారాన్ని బీజేపీ కొట్టిపారేసింది. ఘటనపై స్వతంత్ర దర్యాప్తు జరిపించాలని డిమాండ్‌ చేస్తోంది.

నందిగ్రామ్‌లో నామినేషన్‌ వేసి వస్తున్న సమయంలో తోపులాటలో గాయపడ్డ మమతా బెనర్జీ కోల్‌కతాలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నిన్న సాయంత్రం డిశ్చార్జ్‌ అయ్యారు. ఆమె పరిస్థితి మెరుగుపడినట్లు డాక్టర్లు చెప్పారు. దీదీ పట్టుబట్టడంతో డిశ్చార్జ్‌ చేయాల్సి వచ్చిందని వైద్యులు చెప్పారు. అయితే, విశ్రాంతి తీసుకుంటే మంచిదని, కొన్ని షరతుల మీద ఆమె ప్రచారలో పాల్గొనాలని సూచించారు. ఆస్పత్రి నుంచి వీల్‌చైర్‌లో బయటకు వచ్చిన ఆమె.. బ్యాండేజ్‌తోనే కారులో ఇంటికి వెళ్లారు.

మరోవైపు ఈ పంచాయతీ కేంద్ర ఎన్నికల సంఘం దగ్గరకు చేరింది. తృణమూల్‌, బీజేపీ నేతలు పోటాపోటీగా ఫిర్యాదులు చేశారు. ఆరుగురు సీనియర్‌ నేతలతో కూడిన టీఎంసీ ప్రతినిధి బృందం ముగ్గురు కమిషనర్లతో గంటపాటు సమావేశమైంది. మమతా బెనర్జీపై జరిగింది ముమ్మాటికీ దాడేనని.. అందుకు సంబంధించిన ఆధారాలను సీఈసీ సునీల్‌ అరోరాకు సమర్పించింది. దాడికి ముందు బెంగాల్‌ బీజేపీ నేతలు ట్వీట్ల ద్వారా బెదిరించారని, ఇదంతా కుట్రలో భాగమేనని టీఎంసీ నేతలు ఆరోపించారు.

టీఎంసీ చేస్తున్న ఆరోపణలను బీజేపీ నేతలు కొట్టిపారేశారు. ఈ ఘటనపై స్వతంత్ర దర్యాప్తు జరపాలని కేంద్రమంత్రి పీయూశ్‌ గోయెల్‌, పార్టీ ప్రధాన కార్యదర్శి దేవేంద్ర యాదవ్‌, సంబిట్‌ పాత్రాలతో కూడిన ప్రతినిధి బృందం సీఈసీకి వినతి పత్రం అందించింది. అటు మమతను తోసేసిన దృశ్యాల వీడియోలను పరిశీలించిన ఎన్నికల కమిషన్‌ వీటిపై తక్షణం నివేదిక పంపాలని రాష్ట్ర అధికారులను కోరింది.

Tags

Read MoreRead Less
Next Story