నేతాజీ జయంతిపై మోదీ వర్సెస్ మమత

బెంగాల్ ఎన్నికలు సమీపిస్తున్నాయి. బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్ రాజకీయ చదరంగంలో వేగంగా పావులు కదుపుతున్నాయి. వచ్చిన ప్రతి అవకాశాన్నీ తమకు అనుకూలంగా మలుచుకునేందుకు సర్వ శక్తులు ఒడ్డుతున్నాయి. అన్ని అంశాల్ని ఉపయోగించుకుంటున్నాయి. ఇదే తరుణంలో నేతాజీ సుభాస్ చంద్రబోస్ 125వ జయంతి ఉత్సవాలు రావడంతో.. వీటిపైనా పోటీ పడుతున్నాయి. ఉత్సవాల్ని అనుకూలంగా మలుచుకునేందుకు రెండు పార్టీలు పోటీ పడుతున్నాయి.
నేతాజీ సుభాస్ చంద్రబోస్ 125 వ జయంతి ఉత్సవాల్ని పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ బెంగాల్‌లో పర్యటించనున్నారు. కోల్‌కతా ఎల్జిన్ రోడ్డులోని నేతాజీ భవన్‌ను సందర్శించనున్నారు. అక్కడి నుంచే 'పరాక్రమ దివస్' ను ప్రారంభించి, ప్రసంగిస్తారు. అనంతరం.. నేతాజీపై రూపొందించిన ఎగ్జిబిషన్‌ను, పోస్టల్ స్టాంప్‌ను ప్రారంభిస్తారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మోదీ పర్యటనకు ప్రాధాన్యత ఏర్పడింది. బెంగాల్ పర్యటనను పురస్కరించుకొని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. ''నేతాజీ సుభాస్ చంద్రబోస్ ఆలోచనలు, ఆదర్శాలు గర్వించదగ్గవి. బలమైన, నమ్మకమైన, స్వావలంబన కలిగిన భారతాన్ని నిర్మించేందుకు దోహదపడతాయి..." అని పేర్కొన్నారు.
మరోవైపు.. నేతాజీ జయంతి ఉత్సవాల్ని 'పరాక్రమ దివస్' పేరుతో నిర్వహించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో తృణమూల్ కాంగ్రెస్ కూడా రంగంలోకి దిగింది. నేతాజీ జయంతి ఉత్సవాల్ని 'దేశ్ నాయక్ దివస్' పేరుతో జరిపేందుకు సిద్ధమైంది. రెండు పార్టీలు ఉత్సవాలకు సిద్ధమైన వేళ.. బెంగాల్‌లో ఇవాళ ఎలాంటి పరిణామాలు జరగనున్నాయనే ఉత్కంఠ నెలకొంది.
కేంద్ర హోంమంత్రి అమిత్‌షా పర్యటనలు చేపట్టినప్పటి నుంచి బెంగాల్ రాజకీయాలు హాట్ టాపిక్‌గా మారాయి. అనంతరం.. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పర్యటన సందర్భంగా.. కాన్వాయ్‌పై దాడి జరగడంతో రాజకీయాలు పతాక స్థాయికి చేరుకున్నాయి. ఇక... అమిత్ షా సమక్షంలో తృణమూల్ కీలక నేత సుబేందు అధికారి, మరికొందరు నేతలు కమలదళంలో చేరడంతో బెంగాల్ రాజకీయ ముఖ చిత్రం మారింది. ఇప్పుడు నేతాజీ ఉత్సవాల్లోనూ రెండు పోటీ పడుతున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com