బీజేపీ, టీఎంసీల మధ్య కొనసాగుతున్న మాటల యుద్ధం

పశ్చిమబెంగాల్లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం హోరాహోరిగా సాగుతోంది. అటు బీజేపీ, ఇటు టీఎంసీ.. విమర్శలు ప్రతివిమర్శలతో ప్రచారాన్ని వేడెక్కిస్తున్నాయి. ప్రచారంలో భాగంగా.. ప్రధాని మోదీ బెంగాల్‌లో పర్యటిస్తున్నారు. ఖరగ్‌పూర్ ర్యాలీలో పాల్గొన్న ఆయన.. బెంగాల్ సీఎం మమతపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బెంగాల్ ప్రజలు ఎంతో నమ్మకంతో దీదీకి అధికారం అప్పగిస్తే.. ఆమె తిరిగి వారికి అవినీతిని ఇచ్చారంటూ ఆరోపించారు. పదేళ్ల మమత పాలన గురించి లెక్కలు అడిగితే ఆమెకు కోపం వస్తుందని, ఆంఫన్ బాధితుల పరిహారం, రేషన్ దోపిడీ, బొగ్గుకుంభకోణం వేటి గురించి అడిగినా జైల్లో పెడుతోందంటూ విమర్శించారు. తాము అధికారంలోకి వచ్చాక వీటన్నింటిపైనా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజల ఉత్సాహాన్ని చూస్తే బెంగాల్‌లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటవడం ఖాయంగా కనిపిస్తోందన్నారు మోదీ. ఐదేళ్లు తమకు అవకాశం ఇస్తే.. 70ఏళ్ల అభివృద్ధి చేస్తామన్నారు. బెంగాల్ ఉజ్వల భవిష్యత్తు కోసం బీజేపీ ప్రభుత్వం ఎంతో అవసరమన్నారు మోదీ.
బెంగాల్ యువతకు కీలకమైన పదేళ్లను దీదీ వ్యర్థం చేశారంటూ మండిపడ్డారు ప్రధాని మోదీ. వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ 50-55 నిమిషాలు ఆగిపోతేనే అందరూ ఆందోళనకు చెందుతున్నారని, కానీ బెంగాల్‌లో అభివృద్ధి 50-55ఏళ్లుగా ఆగిపోయిందన్నారు. దీదీ పాలనపై అసహనంతో ఉన్న యువకులు, మహిళలు బీజేపీకి ఓటు వేస్తున్నారన్నారు. కేంద్రం, రాష్ట్రంలో బీజేపీ అధికారంలో ఉన్న చోట ప్రభుత్వాలు డబుల్ ఇంజిన్ తరహాలో సమర్థంగా పనిచేస్తున్నాయిన్నారు మోదీ.
మరోవైపు బీజేపీపై బెంగాల్ సీఎం, టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీ సైతం తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బీజేపీ ప్రపంచంలోనే అతిపెద్ద 'దోపిడీదారు'' అంటూ ఆమె ధ్వజమెత్తారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంతా సీఎం మమత ఈస్ట్ మిడ్నాపూర్ జిల్లా హాల్దియాలోజరిగిన ఓ ర్యాలీలో పాల్గొని ప్రసంగించారు. రాష్ట్రంలో అల్లర్లు సృష్టించేందుకు, ప్రజలను చంపేందుకు, దళిత బాలికలపై వేధింపులకు బీజేపీ కుట్రపన్నుతోందంటూ ఆరోపించారు. దేశ ఆర్థిక వ్యవస్థను మోదీ సర్వ నాశనం చేశారని దుయ్యబట్టారు. పెద్ద నోట్ల రద్దు నుంచి మొదలుపెట్టి బ్యాంకుల ప్రైవేటీకరణ వరకు ఆయన తీసుకున్న నిర్ణయాలన్నీ ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీశాయని ఆరోపించారు. నేడో, రేపో హల్దియా పోర్టును కూడా అమ్మేస్తానంటారని మండిపడ్డారు.
బెంగాల్ల్లో 294 శాసన సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతుతున్నాయి. మొత్తం ఎనిమిది దశల్లో నిర్వహించనున్న ఎన్నికలు ఈ నెల 27 నుంచి ప్రారంభం కానున్నాయి.ఏప్రిల్ 29న చివరి దశ పోలింగ్ జరుగుతుంది. మే 2న ఓట్ల లెక్కింపు జరుగుతుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com