Konijeti Rosaiah: మాజీ ముఖ్యమంత్రి రోశయ్య మృతిపై ప్రముఖుల సంతాపం

Konijeti Rosaiah: మాజీ ముఖ్యమంత్రి రోశయ్య మృతిపై ప్రముఖుల సంతాపం
X
Konijeti Rosaiah: విలువలకు మారు పేరు రోశయ్య అని కొనియాడారు. తన మాట తీరుతో విమర్శకులను సైతం మెప్పించేవారని అన్నారు.

Konijeti Rosaiah: మాజీ ముఖ్యమంత్రి రోశయ్య మృతిపట్ల సంతాపం తెలిపారు మంత్రి జగదీష్‌ రెడ్డి. విలువలకు మారు పేరు రోశయ్య అని కొనియాడారు. తన మాట తీరుతో విమర్శకులను సైతం మెప్పించేవారని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్నారని జగదీష్‌ రెడ్డి అన్నారు. ఆర్థిక క్రమశిక్షణను ఆయన నుండి ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలన్నారు.

రోశయ్య మృతికి తీవ్ర సంతాపాన్ని తెలియజేశారు రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అత్యధిక సార్లు బడ్జెట్‌ ప్రవేశపెట్టిన ఘనత రోశయ్యదేనన్నారు. ఎంత పెద్ద పదవిలో ఉన్న ఒదిగి ఉండడం రోశయ్య గొప్పతనమన్నారు టీజీ వెంకటేష్. 2009 సంవత్సరంలో వరదలు వచ్చినప్పుడు కర్నూలు నగరాన్ని రోశయ్య ఆదుకున్నారని గుర్తు చేసుకున్నారు.

తమిళనాడు సీఎం స్టాలిన్ రోశయ్య మృతికి సంతాపం తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రిగా, తమిళనాడు గవర్నర్‌గా రోశయ్య పని చేశారని గుర్తు చేసుకున్నారు. సుదీర్ఘ అనుభవం, మేధస్సు రోశయ్య సొంతమన్నారు స్టాలిన్. రోశయ్య కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

రోశయ్య మృతి పట్ల మంత్రులు కేటీఆర్, హరీష్ సంతాపం ప్రకటించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలన్నారు. వారి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. మంత్రిగా, ముఖ్యమంత్రిగా, గవర్నర్‌గా రోశయ్య అనేక పదవులకు వన్నె తెచ్చారని గుర్తు చేసుకున్నారు మంత్రి హరీష్ రావు.

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంఛార్జ్‌ మాణిక్కం ఠాగూర్ రోశయ్య మృతి కాంగ్రెస్ పార్టీకి తీరని లోటన్నారు.

మాజీ మంత్రి రఘువీరారెడ్డి రోశయ్య మృతిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేగా, మంత్రిగా, కేబినెట్ కమిటీలో సభ్యుడిగా ఆయనతో కలిసి పని చేయడం అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు.


Tags

Next Story