Yamuna River Pollution: యమునా నది కాలుష్యం.. ఢిల్లీ ప్రజల ఆగ్రహం

Yamuna River Pollution: ఢిల్లీలోని యమునా నది కాలుష్యంతో నిండిపోయింది. పరిశ్రమల వ్యర్థాలను యమునా నదిలోకే విడుదల చేయడంతో నీరు మొత్తం కలుషితం అయిపోతోంది. దీంతో నది ఉపరితలంపై విషపూరిత నురుగు తేలుతూ ప్రవహిస్తోంది. ఈ విషపు నురగలపై జనం ఆందోళన చెందుతున్నారు. ఛాత్ పూజా వేడుకల ఉండటంతో కాళింది కుంజ్ దగ్గర నదిలో కాలుష్యంపై భక్తులు ఆందోళన చెందుతున్నారు.
ఇక అక్టోబర్ 30, 31 తేదీల్లో ఢిల్లీ ప్రజలు ఛాత్ పూజా వేడుకలను నిర్వహిస్తారు. ఇందులో భాగంగా యమునా నదిలో భక్తులు తెల్లవారు జామునే పుణ్యస్నానాలు ఆచరించి సూర్యు నమస్కారాలు చేయడం ఆచారంగా వస్తోంది. అయితే ప్రస్తుతం యమునా నదిలో పుణ్యస్నానాలు ఆచరించే పరిస్ధితి లేదు. కాలుష్యంతో నిండిపోవడంతో పుణ్యస్నానాలు చేయడం ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
అయితే ఛాత్ పూజా స్నానాల కోసం యమునా నది వద్ద భక్తులకు ఘాట్‌లు, స్వచ్ఛమైన నీరు అందిస్తామన్నామని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ గతంలోనే హామీ ఇచ్చారు.. దీనికి కోసం అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చామని...ఛాత్ పూజా సమయంలో యమునా నది కలుషితం కాకుండా చూస్తామని మరోసారి ట్విట్టర్లో పోస్ట్ చేశారు.. అయినా ఇంకా నదిలో విషపు నురగలు ప్రవహిస్తుండటంతో ప్రభుత్వంపై విమర్శలు వస్తున్నాయి.. దీంతో ఆయనే స్వయంగా రంగంలోకి దిగి పరిస్ధితులపై సమీక్ష చేశారు..
మరోవైపు యమునా నదిలో అంతకంతకూ పెరిగిపోతున్న కాలుష్యాన్ని నియంత్రించటానికి ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. బీఐఎస్ ప్రమాణాలు లేని సబ్బులు, డిటర్జెంట్ల అమ్మకం,రవాణా, మార్కెటింగ్‌ను ప్రభుత్వం నిషేధించింది. నాణ్యత లేని సబ్బులు, డిటర్జెంట్ల విక్రయాలను నిషేధించాలని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ యమునా మానిటరింగ్ కమిటీ సిఫారసు చేయటంతో ప్రభుత్వం వాటిని బ్యాన్ చేసింది. అయితే ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నామని చెబుతున్నప్పటికీ కాలుష్యం తగ్గకపోవడంపై ఢిల్లీ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com