ఐదు దశాబ్ధాల ప్రజా జీవితంలో ఆ పదవిని చేపట్టాలని ప్రణబ్ కలలు

భారత రాజకీయాల్లో తనదైన గుర్తింపు పొందారు ప్రణబ్ ముఖర్జీ. ఆయన చదువు పూర్తయిన అనంతరం కొంతకాలం టీచర్‌గా, జర్నలిస్టుగా పనిచేశారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన ప్రణబ్ ముఖర్జీ 2012 నుంచి 2017 వరకు భారత 13వ రాష్ట్రపతిగా పనిచేశారు. అంతకుముందు మన్మోహన్ సింగ్, పీవీ నరసింహారావు, రాజీవ్ గాంధీ, ఇందిరాగాంధీ హయాంలో మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. 1973లో తొలిసారి ఇందిరా గాంధీ హయాంలో కేంద్రమంత్రిగా పనిచేశారు. 1969లో రాజకీయ ప్రయాణం ప్రారంభించిన ఆయన.. 1969 నుంచి 1999 మధ్య ఐదు సార్లు పెద్దల సభకు ప్రాతినిధ్యం వహించారు. 2004లో, 2009లో వరుసగా రెండు సార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు.
1984లో ఇందిరాగాంధీ హత్య అనంతరం కాంగ్రెస్‌ను వీడిన ప్రణబ్.. రాష్ట్రీయ సమాజ్ వాదీ కాంగ్రెస్ పార్టీని స్థాపించారు. కొన్ని కారణాల వల్ల 1989లో ఆ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేశారు. కాంగ్రెస్‌తో సుదీర్ఘ రాజకీయ అనుబంధం కలిగిన ప్రణబ్ ముఖర్జీ.. 23 ఏళ్ల పాటు పార్టీ వర్కింగ్ కమిటీ సభ్యునిగా కొనసాగారు. రాజనీతిజ్ఞునిగా పార్టీలకు అతీతంగా అనుబంధం కలిగి ఉన్న నేత ప్రణబ్ ముఖర్జీ. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి, ప్రణబ్‌లు మంచి స్నేహితులు.
1969 మిడ్నాపూర్ ఉప ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా విజయం సాధించారు ప్రణబ్. 34 ఏళ్లకే కాంగ్రెస్ తరపున రాజ్యసభలో అడుగు పెట్టారు ప్రణబ్ ముఖర్జీ. 1973లో కేంద్ర కేబినెట్ మంత్రిగా ఎంపికయ్యారు. ఆనాటి ప్రధాని ఇందిరాగాంధీకి నమ్మినబంటుగా పేరుబడ్డ ప్రణబ్ ముఖర్జీ 1975, 1981, 1993, 1999లో వరుసగా రాజ్యసభకు నామినేట్ అయ్యారు. 1991లో ప్రణాళిక సంఘం డిప్యూటీ చైర్మన్‌గా పని చేసిన ప్రణబ్ ...1998లో కాంగ్రెస్ అధ్యక్షురాలిగా సోనియా ఎన్నిక కావడంతో కీలకపాత్ర పోషించారు.
ఐదు దశాబ్ధాల ప్రజా జీవితంలో ప్రధానమంత్రి పదవిని చేపట్టాలని ప్రణబ్ కలలుగన్నారు. అయితే ఊహించని రాష్ట్రపతి పదవి ఆయనను వరించింది. చాలాసార్లు ప్రధాన మంత్రి పదవి తప్పిపోయింది. 2004లో కాంగ్రెస్‌లో అత్యంత సీనియర్ అయిన ఆయనను పక్కనబెట్టి మన్మోహన్‌సింగ్‌ను పార్టీ అధిష్టానం ఎంపిక చేసింది. అంతకుముందు 1984లో మాజీ ఇందిరాగాంధీ హత్య అనంతరం ప్రణబ్ ముఖర్జీకి ప్రధాన మంత్రి పదవి వస్తుందని అనుకున్నారు. కానీ కాంగ్రెస్ రాజీవ్ గాంధీ వైపు మొగ్గుచూపింది.
2004లో తొలిసారి లోక్ సభకు ఎన్నికైన ప్రణబ్ ముఖర్జీ, 2004 నుంచి 2012 వరకు యూపీఏ ప్రభుత్వంలో నెంబర్ 2గా కొనసాగారు. కీలకమైన రక్షణ, విదేశాంగ, ఆర్థిక, వాణిజ్య శాఖలు ప్రణబ్ నిర్వహించారు. ప్రణబ్ 2008లో పద్మ విభూషణ్, 2019లో భారతరత్న అందుకున్నారు. రాష్ట్రపతి బాధ్యతల నుంచి వైదొలగిన తర్వాత ఆయన క్రీయాశీల రాజకీయాలకు దూరంగా ఉన్నారు.
రాష్ట్రపతిగా తన ఐదేళ్ల పదవీకాలంలో ఉగ్రవాదుల క్షమాభిక్ష పిటిషన్లు తిరస్కరించారు ప్రణబ్ ముఖర్జీ. తద్వారా వారి ఉరి తీతకు మార్గం సుగమం చేశారు. పార్లమెంట్‌పై దాడి కేసులో అఫ్జల్ గురు, ముంబైపై దాడి కేసులో అజ్మల్ కసబ్, ముంబై పేలుళ్ల కేసులో యాకుబ్ మెమన్ తదితరులందరి క్షమాభిక్ష పిటిషన్లు తిరస్కరించారు. పదవీకాలంలో మొత్తం 30 క్షమాభిక్ష పిటిషన్లు తిరస్కరించారు ప్రణబ్. క్షమాభిక్ష పిటిషన్లు పెట్టుకొని మరికొంతకాలం బతికేద్దామనుకున్న ఉగ్రవాదులు, సంఘ విద్రోహ శక్తులకు ప్రణబ్ చెక్ పెట్టారు. రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేశారు దాదా.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com