నేడు లోథి ఎస్టేట్‌లో ప్రణబ్ ముఖర్జీ అంత్యక్రియలు

అనారోగ్యంతో హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ కన్నుమూసిన..... మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అంత్యక్రియలు ఇవాళ ఢిల్లీలోని లోథి ఎస్టేట్‌లో జరగనున్నాయి. నెల రోజులుగా కోమాలో ఉన్న ప్రణబ్ ముఖర్జీ సోమవారం సాయంత్రం కన్నుమూశారు. ప్రణబ్ మృతి దేశానికి తీరని లోటని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్రమోదీ, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, తెలంగాణ, ఏపీ ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్ సంతాపం తెలిపారు.
ప్రణబ్ ముఖర్జీకి అధికారిక లాంఛనాలతో తుది వీడ్కోలు పలికేందుకు రక్షణ శాఖ ఏర్పాట్లు చేస్తోంది. కేంద్రం ఏడు రోజుల్ని సంతాప దినాలు ప్రకటించింది. పార్లమెంట్, రాష్ట్రపతి భవన్ సహా అన్ని కార్యాలయాలపై జాతీయ జెండాను అవనతం చేయనున్నారు.
ప్రణబ్ ముఖర్జీ నెల రోజుల క్రితం అస్వస్థతతో ఢిల్లీలోని ఆర్మీ హాస్పిటల్‌లో చేరారు. మెదడులో రక్తం గడ్డ కట్టినట్టు పరీక్షల్లో తేలడంతో అత్యవసర చికిత్స చేశారు. ఇదే సమయంలో ప్రణబ్‌కు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ కూడా సోకడంతో పరిస్థితి విషమించి కోమాలోకి వెళ్లారు. వైద్యులు శ్రమించినా ఫలితం దక్కలేదు.
ప్రణబ్ ముఖర్జీ మృతి పట్ల రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రణబ్ ఇక లేరన్న వార్త ఎంతో బాధ కలిగిస్తోందని రాష్ట్రపతి అన్నారు. ప్రణబ్ మరణంతో ఓ శకం ముగిసిందని పేర్కొన్నారు. పవిత్ర ఆత్మతో భరత మాతకు సేవలు అందించారని, ప్రజా జీవితంలో సమున్నతంగా నిలిచారని కొనియాడారు. సామాన్యుడి నుంచి రాష్ట్రపతిగా ఎదగిన ప్రణబ్.. ప్రజలకు త్సంప్రదాయాన్ని కొనసాగించారని తెలిపారు.
ప్రణబ్‌పై మృతిపై కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ప్రణబ్ కుమార్తె శర్మిష్ఠకు లేఖ రాశారు. ఐదు దశాబ్దాల పాటు కాంగ్రెస్‌తో విడదీయరాని భాగం అయ్యారని సోనియా పేర్కొన్నారు. ప్రణబ్ మేధాశక్తి తోడు లేకుండా ఇప్పుడెలా మనుగడ సాగించగలమో ఊహించలేకపోతున్నామని పేర్కొన్నారు. ప్రణబ్‌జీ మరణంతో దేశం దుఖంలో మునిగిపోయిందని కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు.
ప్రణబ్ మృతి పట్ల తెలంగాణ, ఏపీ సీఎంలు కేసీఆర్, జగన్ సంతాపం తెలిపారు. తెలంగాణతో ప్రణబ్ ముఖర్జీకి ప్రత్యేక అనుబంధం ఉందని, యూపీఏ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీకి ప్రణబ్ ముఖర్జీయే నేతృత్వం వహించారని గుర్తుచేశారు. ప్రణబ్ ముఖర్జీ మరణం దేశనికి తీరని లోటు అని టీడీపీ అధినేత చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com