ఇంటి గోడలకు పగుళ్లు.. ఇలా కడితే సరి: ఇంజనీర్ల సూచన

ఇంటి గోడలకు పగుళ్లు.. ఇలా కడితే సరి: ఇంజనీర్ల సూచన
X
పూర్తిగా మేస్త్రీపై ఆధాపడి ఇల్లు కడితే ఇలానే ఉంటుందంటున్నారు సివిల్ ఇంజనీర్లు. పగుళ్లు రాకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు

ఇల్లు కట్టి ఏడాది కూడా కాలేదు.. ఆ పగుళ్లేంటని అందరూ అడుగుతుంటే ఏం చేయాలో అర్థం కాదు.. అప్పటికీ క్యూరింగ్ బాగానే చేశాం కదా అని ఆలోచిస్తుంటారు.. సరైన ఇంజనీర్ల సలహా తీసుకుని ఇల్లు కట్టడం మొదలు పెడితే ఈ పగుళ్లను నివారించొచ్చని అంటున్నారు నిపుణులు. పూర్తిగా మేస్త్రీపై ఆధాపడి ఇల్లు కడితే ఇలానే ఉంటుందంటున్నారు సివిల్ ఇంజనీర్లు. పగుళ్లు రాకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు వివరిస్తున్నారు.

* ఇంటి నిర్మాణానికి ఇసుక ఎంపిక కూడా చాలా కీలకం. నదుల నుంచి తీసుకు వచ్చిన ఇసుకను కడిగి ఉపయోగించుకుంటే అందులో ఉండే నల్లటి బంకమట్టి పోతుంది. అప్పుడు పగుళ్లకు ఆస్కారం ఉండదు.

* ఒకవేళ రాతి ఇసుక వాడుతున్నట్లైతే ప్రామాణికమైన సర్టిఫైడ్ ఇసుక వాడాలి. మామూలు రకం వాటిలో ఎక్కువ శాతం డస్ట్ కలపడంతో నాణ్యత లోపించి కొద్ది రోజులకే పగుళ్లు వస్తుంటాయి.

* క్యూరింగ్ చేసేటప్పుడు కూడా సాధ్యమైనంతవరకు మంచి నీరు ఉపయోగించాలి. గోడలకు క్యూరింగ్ పూర్తయిన వెంటనే ప్లాస్టిక్ చేయకుండా కొంత వ్యవధితో చేయడం మంచిది.

* పగుళ్ల నివారణకు మార్కెట్లో పలు రసాయనాలు అందుబాటులోకి వచ్చాయి. నిర్మాణ సమయంలో వాటిని సిమెంట్‌ మిశ్రమంలో కలుపుకుంటే పగుళ్లు రాకుండా నివారించొచ్చు.

* నైపుణ్యం కలిగిన మేస్త్రీని పనిలో పెట్టుకుంటే 90 శాతం పగుళ్లు ఉత్పన్నం కావు.

* వాతావరణానికి తగ్గట్టు క్యూరింగ్ చేయాలి. తడి ఆరకుండా చూడాలి. రోజుకు మూడు సార్లు మించి కూడా నీళ్లు పట్టాలి. సిమెంట్ మిశ్రమంలో వేడి ఉంటుంది. అది బయటకు రాకుండా ఎప్పటి కప్పుడు నీళ్లు కొడుతూ చల్లబరచాలి. 14 రోజుల పాటు ఏకధాటిగా నీరు కొడుతూ తడి ఆరకుండా చూడాలి. అప్పుడు పగుళ్లు వచ్చే అవకాశం ఉండదు.. ధృఢత్వం సంతరించుకుంటుంది.

* సాధారణంగా గోడలు, స్తంభాలు, శ్లాబు కలిసే చోట ఎండాకాలం, శీతాకాలంలో సంకోచ వ్యాకోచాలతో పగుళ్లు ఏర్పడుతుంటాయి. అందుకే గోడ, స్తంభం కలిసే చోట రెండేసి అంగుళాల మేర పై నుంచి కింది వరకు పల్చటి ఇనుపజాలి కొట్టాలి. దీనిపై రెండు దశల్లో ప్లాస్టరింగ్ చేయాలి. వివిధ సీజన్లలో ఏర్పడే సంకోచ వ్యాకోచాలకు సర్దుబాటు అవుతుంది తప్ప పగుళ్లు రావు. పెద్ద పెద్ద నిర్మాణ సంస్థలు ఈ పద్దతినే అనుసరిస్తున్నాయి.

* గోడలు కట్టేటప్పుడు స్తంభాలు, కాలమ్స్, స్లాబుకు సిమెంట్ మిశ్రమం పట్టేలా ముందుగా అక్కడ గరుకుగా చేయాలి. దీనికి సిమెంట్ కొట్టాక అప్పుడు ఇటుకలు పెడితే గట్టిదనం వస్తుంది.

ఈ జాగ్రత్తలు పాటిస్తూ ఇల్లు కట్టుకుంటే ఇంచి కూడా పగుళ్లు కనిపించవంటున్నారు ఇంజనీర్లు..

Tags

Next Story