ఢిల్లీ రైతుల ఆందోళనకు మద్దతుగా వామపక్ష నేతలు ధర్నా

ఢిల్లీ రైతుల ఆందోళనకు మద్దతుగా వామపక్ష నేతలు ధర్నా

నూతన వ్యవసాయ చట్టాల్ని రద్దు చేయాలనే డిమాండ్‌తో ఢిల్లీ రైతులు చేస్తున్న ఆందోళనకు మద్దతుగా హైదరాబాద్‌ శివారులోని శంషాబాద్‌ ఔటర్‌ రింగ్‌ రోడ్‌ టోల్‌ ప్లాజా వద్ద సీపీఎం ఆందోళన చేపట్టింది. నో టోల్‌ ఫీ అనే నినాదంతో ధర్నా చేశారు. కార్పోరేట్‌ రంగాలకు రెడ్‌ కార్పెట్‌ పరిచేలా కేంద్రం కొత్త చట్టాలు తీసుకొచ్చిందని విమర్శించారు. నూతన వ్యవసాయ చట్టాలు రద్దు చేసే వరకు ఆందోళన కొనసాగుతుందని స్పష్టంచేశారు.

ఢిల్లీ రైతుల ఆందోళనకు మద్దతుగా శంషాబాద్‌ కిషన్‌గూడ వద్ద సీపీఎం ఆధ్వర్యంలో టోల్‌ఫ్రీ డిమాండ్‌తో ధర్నా చేశారు. ఆదానీ, అంబానీ ఉత్పత్తుల్ని బహిష్కరించాలంటూ నినాదాలు చేశారు. ఉద్రిక్తతలు తలెత్తకుండా భారీగా పోలీసులు మోహరించారు.

కృష్ణా జిల్లా పొట్టిపాడు టోల్‌ప్లాజా వద్ద రైతు సంఘాల నేతలు ఆందోళన నిర్వహించారు. టోల్‌ప్లాజా వద్ద రైతులకు మినహాయింపు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. కృష్ణా జిల్లా కీసర టోల్‌ప్లాజా వద్ద రైతు సంఘాలు ఆందోళన నిర్వహించాయి. టోల్‌ప్లాజా వద్ద ఆందోళన చేస్తున్న రైతు సంఘం నేతల్ని పోలీసులు అదుపులోకి తీసుకుని... వీరులపాడు పీఎస్‌కు తరలించారు.

గుంటూరు జిల్లా పిడుగురాళ్ల మండలం తుమ్మలచెరువు టోల్‌ప్లాజా వద్ద వామపక్ష నేతలు ధర్నా నిర్వహించారు. కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాల్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వామపక్ష నేతల ఆందోళనతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.

ప్రకాశం జిల్లాలో సీపీఐ, సీపీఎం, రైతు సంఘాల నేతలు టంగుటూరు టోల్‌గేట్‌ వద్ద నిరసన తెలిపారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కేంద్రం రైతు వ్యతిరేక చట్టాల్ని వెనక్కి తీసుకోవాలని, లేదంటే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని అన్నారు. కేంద్రం స్పందించకపోతే ఉద్యమం ఉధృతం చేస్తామని రైతులు, రైతు సంఘాల నేతలు హెచ్చరించారు.

Tags

Next Story