Punjab : ఖలిస్థానీ సపోర్టర్ అమృత్ పాల్ సింగ్ అరెస్ట్

ఖలిస్థానీ సపోర్టర్, 'వారిస్ పంజాబ్ డి' చీఫ్ అమృత్ పాల్ సింగ్ ను అరెస్ట్ చేశారు పోలీసులు. జలందర్ లోని నకోదర్ ప్రాంతంలో అమృత్ పాల్ సింగ్ తో పాటు ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. అమృత్ పాల్ సింగ్ అరెస్ట్ తో అతని మద్దతుదారులు పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగారు. పోలీసులు భారీగా మోహరించి చెదరగొడుతున్నారు. ముందుగానే రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ నెట్ ను నిలిపేశారు. శాంతి భద్రతల దృష్ట్యా ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలిపారు. అమృతపాల్ సింగ్ గత కొన్ని వారాలుగా పంజాబ్‌లో ఘర్షణ వాతావరణాన్ని సృష్టిస్తున్నాడు. అమృత్‌పాల్ సహాయకులలో ఒకరిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ అతని మద్దతుదారులు గత నెలలో అమృత్‌సర్ శివార్లలోని అజ్నాలా పోలీసులతో ఘర్షణకు దిగారు. దీంతో అమృత్ పాల్ సింగ్,అతని అనుచరులను పోలీసులు అరెస్ట్ చేశారు. తప్పుడు ప్రచారాలను చేయకూడదని పోలీసులు కోరారు. ఇంటర్నెట్ నిలిపివేసినందున ప్రజలు అనవసరపు భయాందోళనలకు గురికావద్దని పోలీసులు తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com