Amarinder singh : అమిత్ షాతో కెప్టెన్ అమరీందర్ సింగ్ భేటి...!

పంజాబ్ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికలకు ముందు కాంగ్రెస్ కు దెబ్బమీద దెబ్బ తగులుతోంది. ఢిల్లీ వెళ్లిన మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ బీజేపీలో చేరుతారన్న వార్తలకు బలం చేకూర్చేలా ఈ రోజు పరిణామాలు జరిగాయి. నిన్న పార్టీ మారేది లేదని స్పష్టం చేసిన అమరీందర్ సింగ్... 24 గంటలు కూడా తిరగకముందే కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో భేటీ అయ్యారు. బీజేపీలో చేరడానికి దాదాపు రంగం సిద్ధం చేసుకున్నారు. త్వరలో ఆయన కమలం పార్టీలో చేయడం ఖాయమయిపోయిందని, కేంద్ర క్యాబినెట్ లో కూడా చేరతారని ప్రచారం ఊపందుకుంది.
మరోవైపు నిన్న పంజాబ్ పీసీసీ చీఫ్ పదవికి రాజీనామా చేసిన నవ్‌జ్యోత్ సింగ్ సిద్ధూ ఎపిసోడ్ కొనసాగుతోంది. పంజాబ్ కాంగ్రెస్‌లో ఇంకా చిచ్చు రాజేస్తూనే ఉన్నారు సిద్ధూ. కొత్త క్యాబినెట్‌లో ఉన్న మంత్రి గుర్జీత్‌సింగ్‌ను తక్షణమే తొలగించాలని, అడ్వకేట్ జనరల్, పంజాబ్ డీజీపీని సైతం మార్చాలని పట్టుబడుతున్నారు. తన డిమాండ్లను అధిష్టానం సీరియస్‌గా పరిగణించాల్సిందేనంటూ అల్టిమేట్టం ఇచ్చారు. పంజాబ్ ప్రయోజనాలే తమ అజెండా అని, ఈ విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని సిద్ధూ స్పష్టం చేశారు. అవినీతి మరకలు అంటిన నేతలతో కలిసి పనిచేయలేనని తేల్చి చెప్పారు. అయితే, కాంగ్రెస్ అధిష్టానం మాత్రం సిద్ధూ డిమాండ్లు అంగీకరించేదే లేదని తేల్చి చెప్పింది.
సిద్ధూ రాజీనామాను ఆమోదించని కాంగ్రెస్ అధిష్టానం.. అతన్ని బుజ్జగించే పనిలో పడింది. మంత్రులతో రాయబారం నడిపింది. కొత్త సీఎంతోనూ చెప్పించింది. రాజీనామాను వెనక్కు తీసుకోవాలంటూ ఇద్దరు క్యాబినెట్ మంత్రులు స్వయంగా సిద్ధూ ఇంటికి వెళ్లారు. అయినా వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని సిద్ధూ భీష్మించారు. మరోవైపు సిద్ధూకు మద్దతుగా నిన్న మంత్రి రజీయా సుల్తానా రాజీనామా చేయగా, ఈ రోజు కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ, కోశాధికారి రాజీనామా చేశారు.
పంజాబ్‌లో కాంగ్రెస్ సంక్షోభాన్ని ఎలా చక్కబెట్టాలో తెలియని స్థితిలో పడింది ఆ పార్టీ అధిష్టానం. పరిస్థితిని చక్కదిద్దే బాధ్యతను కొత్త సీఎం చన్నీ మీదే వదిలేసింది. రాహుల్ గాంధీ కేరళ పర్యటనకు వెళ్లిపోగా.. రాష్ట్ర ఇంచార్జ్ హరీష్ రావత్ పంజాబ్ పర్యటన వాయిదా పడింది. ఈ క్రమంలో చన్నీ అత్యవసరంగా కేబినెట్ భేటీ నిర్వహించారు. అనంతరం ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీనే సుప్రీం అని.. ఎవరైనా సరే హైకమాండ్ నిర్ణయానికి కట్టుబడి ఉండాలని చన్నీ స్పష్టం చేశారు. ఈ క్రమంలో సిద్దూతో ఆయన ఫోన్లో మాట్లాడారు. కూర్చుని చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకుందాం అన్నారు.
సిద్ధూ వ్యవహారంపై సీరియస్‌గా ఉన్న హైకమాండ్... ప్లాన్-బి అమలు చేసేందుకు సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా ఒకరిద్దరి పేర్లు పీసీసీ చీఫ్ పదవి కోసం పరిశీలిస్తున్నది. మొత్తానికి కరవమంటే కప్పకు కోపం.. విడవమంటే పాముకు కోపం అన్నట్లుగా పంజాబ్ కాంగ్రెస్ పరిస్థితి మారింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com