Iyer Idly: అమ్మా, నేను, అయ్యర్ ఇడ్లీ.. కార్పొరేట్ ఉద్యోగాన్ని వదిలి..

Iyer Idly: అమ్మా, నేను, అయ్యర్ ఇడ్లీ.. కార్పొరేట్ ఉద్యోగాన్ని వదిలి..
Iyer Idly: మా అమ్మతో కలిసి వేలకొద్దీ ఇడ్లీలు అమ్మడానికి నేను నా బ్యాంకింగ్ ఉద్యోగాన్ని వదులుకున్నాను.

కష్టపడి నిన్ను చదివించింది ఈ వ్యాపారం చేయడానికా అని అమ్మ అన్నా కృష్ణన్ వినిపించుకోలేదు.. కార్పోరేట్ ఉద్యోగం చేసినా కలగని తృప్తి కస్టమర్ కి వేడి వేడి ఇడ్లీ అందిస్తున్నప్పుడు అతడు పొందిన తృప్తి వెయ్యి రెట్లు ఎక్కువ. ఎవరికిందో ఎందుకు పని చేయాలి. నాన్న నడిపిన వ్యాపారంలోనే తాను రాణించాలనుకున్నాడు. డబ్బు సంపాదించాలన్న ఆలోచన కన్నాచేస్తున్న పనిలో ఉన్న ఆనందం.. అది ఎంతో సంతృప్తిని ఇస్తుంది అని అంటాడు కృష్ణన్.

కృష్ణన్ మహదేవన్ తన తల్లి ఉమతో కలిసి బెంగళూరులో అయ్యర్ ఇడ్లీని నడుపుతున్నాడు. 2001లో తండ్రి స్థాపించిన వ్యాపారం. దాదాపు రెండు దశాబ్దాలుగా ఇడ్లీ, చట్నీ మాత్రమే విక్రయించేవారు.

ఇడ్లీ తయారీ కోసం ప్రతి నెలా సుమారు 1.5 టన్నుల బియ్యం, 1 టన్ను మినపప్పుని ఉపయోగిస్తుంటారు. బెంగళూరులోని విజ్ఞాన్ నగర్‌లోని అయ్యర్ ఇడ్లీ కోసం ప్రతిరోజూ జనం క్యూ కడుతుంటారు. 200 చరపు అడుగులలో ఓ చిన్న షాపును ఏర్పాటు చేసుకుని అందులోనే ఇడ్లీ తయారీ, విక్రయం జరుగుతుంటాయి.

ఆశ్యర్యకరమైన విషయం ఏమిటంటే ఒక్క ఇడ్లీ చట్నీ అమ్మే ఆ కుటుంబం రెండు దశాబ్దాలుగా జీవనం సాగిస్తోంది."అయ్యర్ ఇడ్లీ అవసరం నుండి పుట్టింది" అని కృష్ణన్ చెప్పారు. కృష్ణన్ తండ్రి మహదేవన్ 2000లో ఉద్యోగం కోల్పోయాడు. ఆ సమయంలో ఏదో ఒకటి చేసి కుటుంబాన్ని పోషించాలి అని నిర్ణయించుకున్నాడు. పొరుగున ఉన్న దుకాణాలకు ఇడ్లీ పిండిని విక్రయించడం ప్రారంభించాడు.

"అప్పుడు కృష్ణన్ వయసు 10 ఏళ్లు. కానీ దుకాణాలకు పిండిని సరఫరా చేయడంలో తండ్రి సహాయపడేందుకు త్వరగా మేల్కొనేవాడు.. చెల్లి, అనారోగ్యంతో ఉన్న అమ్మమ్మతో సహా ఐదుగురు పోషణకు తండ్రి సంపాదనే ఆధారం.

కేవలం పిండి మాత్రమే ఎందుకు అమ్మడం, ఇడ్లీలు కూడా అమ్మడం ప్రారంభించాలని సూచించారు కాలనీ వాసులు. 27 సెప్టెంబర్ 2001న కృష్ణన్ తండ్రి బెంగళూరులో అయ్యర్ ఇడ్లీ ఏర్పాటు చేశారు. కృష్ణన్ తల్లి ఉమా దేవన్ ఇడ్లీలు తయారు చేస్తుంటే, మహదేవన్ దుకాణాన్ని నడిపేవాడు.

అందరి పిల్లల్లా కృష్ణన్ బాల్యం గడవలేదు. తోటీ స్నేహితులతో సరదాగా గడిపిన రోజులు గుర్తు లేవు. పాఠశాల నుంచి తిరిగి వచ్చిన తరువాత అమ్మానాన్నకు సహాయంగా షాులో ఉండేవాడు. అయినా చదువులో ముందుడేవాడు. పోస్ట్-గ్రాడ్యుయేషన్‌ను పూర్తి చేశాడు.

పీజీ చదువు పూర్తయిన తరువాత కృష్ణన్ సెయింట్ జోసెఫ్ కాలేజ్ ఆఫ్ కామర్స్‌లో ప్రొఫెసర్‌గా తన ఉద్యోగ వృత్తిని ప్రారంభించాడు. ఆ పోస్ట్‌లో అతను గోల్డ్‌మన్ సాక్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్ టీమ్‌లో చేరాడు. అక్కడ నాలుగు సంవత్సరాలు పనిచేశాడు. 2009లో తండ్రి మరణించడంతో వేల రూపాయల జీతం వస్తున్న ఉద్యోగాన్ని వదిలి అమ్మకు సాయంగా ఉండాలనుకున్నాడు.

అయితే అమ్మకు ఉద్యోగం మానేసి దుకాణం ఇడ్లీల వ్యాపారం చేయడం ఇష్టం లేదు. కొడుక్కి ఉద్యోగం లేకపోతే పిల్లని ఎవరిస్తారు, పెళ్లి ఎలా అవుతుందని ఆమె ఆందోళన. వ్యాపారం అంటే లాభనష్టాలు ఉంటాయి. కార్పొరేట్ ఉద్యోగం వదులుకోవడం ఆమెకు ఎంత మాత్రం ఇష్టం లేదు. అయినా అమ్మని ఒప్పించే ప్రయత్నం చేశాడు కృష్ణన్. ఇడ్లీల వ్యాపారం చేయడం మొదలు పెట్టాడు.

లాక్డౌన్ సమయంలో ఎంత బిజీగా ఉన్నానో మా అమ్మ చూసింది. నిరంతరం ఆర్డర్స్ కోసం ఫోన్ కాల్స్‌. భోజనం చేయడానికి కూడా సమయం ఉండేది కాదు అని కృష్ణన్ గుర్తు చేసుకుంటారు.

ఇడ్లీ చేయడం ఒక కళ

ఇడ్లీలు ఇంత స్మూత్ గా ఎలా తయారు చేస్తారని ఉమని అడిగితే మొహమాటం లేకుండా వివరించేస్తారు. మిక్సీలో కాకుండా పిండిని రుబ్బడానికి గ్రైండర్‌ను ఉపయోగించడం. ఇంక పులిసిన ఇడ్లీ పిండిని మస్లిన్ క్లాత్ వేసి ఇడ్లీ ట్రేలలో పోస్తారు . 12 నిమిషాల పాటు ఉడికిస్తే సరిపోతుంది అంటారు ఉమ.

"మేము ఎప్పుడూ మెనులో ఇంకేమీ జోడించలేదు. దుకాణంలో ఇడ్లీ, చట్నీ మాత్రమే లభిస్తాయి. రెండేళ్ళ క్రితం వడ, కారా భాత్, కేసరి భాత్ లను మెనూలో చేర్చారు. ఇవి కూడా జనాదరణ పొందాయని కృష్ణన్ చెప్పారు.

ప్రతిరోజు ఉదయం 6.30 గంటలకు దుకాణం తెరుస్తాము. అయితే లోపల పని మాత్రం ఉదయం 4 గంటలకే ప్రారంభమవుతుంది. ఉదయం 11.30 గంటల వరకు తెరిచి ఉంటుంది. మళ్లీ సాయంత్రం 6 గంటలకు ఓపెన్ చేస్తారు. మూడు ఇడ్లీలు 30 రూపాయలకు అమ్ముతుంటారు. ఏడున్నర సంవత్సరాలుగా అదే ధరకు ఇడ్లీలు విక్రయిస్తున్నారు. ధరలలో పెరుగుదల లేదు."

కృష్ణన్ చెప్పిన ఒక విషయం ఏమిటంటే, మీరు షాప్‌లోకి ఎప్పుడు వెళ్లినా, ఇడ్లీ రుచి మిమ్మల్ని ఎప్పటికీ నిరాశపరచదు. "మేము దుకాణం ముందు భాగాన్ని అందంగా ముస్తాబు చేయడంపై దృష్టి పెట్టాలనుకోలేదు.. కానీ లోపల పరిశుభ్రవాతావరణంలో రుచికరమైన ఇడ్లీల తయారీపైనే మా దృష్టి అంతా అంటారు కృష్ణన్. అందుకే మా కస్టమర్‌లు తిరిగి మళ్లీ మా దగ్గరకు వస్తుంటారు అని ఆనందంగా చెబుతున్నారు తల్లీ కొడుకులు.

Tags

Next Story