ఐశ్యర్య ఆత్మహత్యపై స్పందించిన రాహుల్ గాంధీ

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ కు చెందిన ఐశ్యర్య అనే యువతి ఇంటర్మీడియట్ లో 99శాతం మార్కులతో ఢిల్లీలోని శ్రీరాం లేడీస్ కాలేజీలో సీటు సంపాదించుకుంది. మెకానిక్ పని చేసే ఐశ్యర్య తండ్రి తన కూతురునైనా బాగా చదివించాలని తాపత్రయపడేవాడు. ఇందుకోసమే కూతురు చదువు కోసం ఇళ్లు, బంగారం తాకట్టు పెట్టాడు. అంత సవ్యంగా జరుగుతున్న సమయంలో కరోనా మహమ్మారి వారి జీవితాలను తలకిందులు చేసింది.
లాక్ డౌన్ కారణంగా తండ్రి ఉపాధి కోల్పోవడంతో హాస్టల్ ఫీజు కట్టలేకపోయాడు. దీంతో హాస్టల్ రూమ్ ఖాళీచేసి ఇటీవల షాద్ నగర్ లోని తన నివాసానికి వచ్చింది. కొద్దిరోజుల తర్వాత డబ్బులు కట్టకపోతే రూం ఖాళీ చేయాలని హాస్టల్ యాజమాన్యం నుంచి లేఖ వచ్చింది. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన ఐశ్వర్య ఆర్ధిక ఇబ్బందుల వల్ల చదువును కొనసాగించలేక పోతున్నానని సూసైడ్ నోట్ రాసింది.
తన తండ్రి బైక్ మెకానిక్ కావడంతో తన చదువు కుటుంబానికి భారం కాకూడదనే ఆత్మహత్యకు పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. చదువుల్లో రాణిస్తున్న తన కూతురు అర్ధాంతరంగా తనువుచాలించడంతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగింది.
మరోవైపు ఐశ్యర్య ఆత్మహత్యపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ట్విట్టర్ వేదికగా స్పందించారు. తెలుగులో ఐశ్యర్య కుటుంబానికి సంతాపం తెలిపిన రాహుల్.. నోట్ల రద్దు వల్లే ఇలాంటి పరిస్థితి వచ్చిందని ట్వీట్ చేశారు. ఎన్డీఏ ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాల వల్ల అనేక కుటుంబాలు కుదేలయ్యాయని విమర్శించారు. నోట్ల రద్దు, కరోనా, లాక్ డౌన్ తో ప్రజల జీవితాలన్ని తారుమారు అయ్యాయని చెబుతూ ఐశ్యర్య ఆత్మహత్య వార్తను ట్యాగ్ చేశారు.
ఇటు ఐశ్యర్య ఆత్మహత్యపై దేశవ్యాప్తంగా ఆందోళనలు మిన్నంటుతున్నాయి. ఢిల్లీలో విద్యార్థి సంఘం నాయకులు ఐశ్వర్యకు న్యాయం చేయాలంటూ రోడెక్కారు. హెచ్ఆర్డీ మినిస్టర్ రమేష్ పోక్రియాల్ ఇంటిముందు ఆందోళనకు దిగారు. తక్షణమే ఐశ్యర్య కుటుంబానికి 20లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియాతో పాటు ఐశ్యర్య చెల్లిల చదువుకు సహకరించాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల సమస్యల పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇకనైనా స్పందించకుంటే ఇలాంటి చావులు చాలా చూస్తారని విద్యార్థులు హెచ్చరిస్తున్నారు.
ఈ అత్యంత విచారకరమైన సమయంలో ఈ విద్యార్థిని కుటుంబ సభ్యులకు నా ప్రగాడ సంతాపం తెలుపుతున్నాను.
— Rahul Gandhi (@RahulGandhi) November 9, 2020
ఉద్దేశ పూర్వకంగా చేసిన నోట్ల రద్దు మరియు లాక్డౌన్ ద్వారా, బీజేపి ప్రభుత్వం లెక్కలేనన్ని కుటుంబాలను నాశనం చేసింది.
ఇది నిజం! ఇదే నిజం!! pic.twitter.com/mSszEES6ha
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com