అన్నదాతల అగ్రహజ్వాలలు.. పంట కోతలకు కూడా ఇంటికి వెళ్లే ప్రసక్తే లేదని స్పష్టీకరణ

నూతన వ్యవసాయ చట్టాలను వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ రైతు సంఘాలు రైల్‌రోకో నిర్వహించాయి. గురువారం మధ్యాహ్నం 12 గంటల నుంచి 4 గంటల వరకు రైతు సంఘాల నేతల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో రైతు మద్దతుదారులు పట్టాలపై బైఠాయించి రైళ్లను స్తంభింపజేశారు. బెంగళూరులోని రైల్వే స్టేషన్లలోకి ఆందోళనకారులను వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బిహార్‌లో రైతులు పట్టాలపై పడుకొని నిరసన వ్యక్తం చేశారు. పట్నా జంక్షన్‌లో రైతు సంఘాలు రైళ్లను అడ్డుకొన్నాయి. రైల్‌రోకో సందర్భంగా అధికారులు రైళ్లను స్టేషన్లలోనే నిలిపివేశారు. పంజాబ్, హర్యాణా, జమ్ముకశ్మీర్, కర్ణాటకలోని చాలా ప్రాంతాల్లో రైతులు పట్టాలపైకి చేరుకున్నారు. నూతన వ్యవసాయ చట్టాలను వెనక్కు తీసుకోవాలంటూ రైతులు నినాదాలు చేశారు.
ప్రయాణికుల భద్రత దృష్ట్యా స్టేషన్లలోనే రైళ్లను నిలిపినట్టు అధికారులు తెలిపారు. ఈ ఆందోళనల నేపథ్యంలో రైళ్లు ఆలస్యంగా నడుస్తాయని తెలిపారు. ఏ రైళ్లను రద్దు చేయలేదని వెల్లడించారు. దిల్లీ, పంజాబ్, హర్యాణా, ఉత్తరప్రదేశ్, బెంగాల్‌లోని పలు రైల్వే స్టేషన్ల సమీపంలో అదనపు బలగాల్ని మోహరించారు. తమ డిమాండ్లను ప్రభుత్వం అంగీకరించేంత వరకు నిరసనలు కొనసాగుతాయని రైతు సంఘాల నేతలు తెలిపారు. రైల్‌రోకో రాజకీయాలకు సంబంధించింది కాదని అన్నారు. దేశవ్యాప్తంగా శాంతియుతంగా నిరసనలు తెలిపారు. ప్రయాణికులకు ఇబ్బందులు కలిగిచండం తమ ఉద్దేశం కాదని చెప్పారు.
మరోవైపు... వ్యవసాయ చట్టాలు రద్దయ్యే వరకు తాము ఇళ్లకు వెళ్లబోమని భారతీయ కిసాన్ యూనియన్ నాయకుడు రాకేష్ టికాయిత్ మరోసారి స్పష్టంచేశారు. పంటలు కోయడానికి రైతులు తమ ఇళ్లకు వెళ్లిపోతారనే ఆలోచనలో ప్రభుత్వం ఉండకూడదని అన్నారు. ఇప్పటికే చేతికి వచ్చే పంటలను కూడా త్యాగం చేసేందుకు సిద్ధంగా ఉండాలని రైతులకు పిలుపునిచ్చారు. చేతికి వచ్చిన పంటను తగులబెట్టాల్సి వస్తే దానికి కూడా సిద్ధంగా ఉండాలని హర్యాణాలో జరిగిన మహాపంచాయత్ సభలో టికాయిత్ స్పష్టంచేశారు. వ్యవసాయ చట్టాల్ని రద్దు చేసే వరకు 'ఘర్ వాప్‌సీ' ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు.
అటు... ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేయడంలో భాగంగా తదుపరి కార్యాచరణకు అన్నదాతలు సిద్దంగా ఉండాలని రైతు సంఘాల నేతలు విజ్ఞప్తి చేశారు. హర్యాణాలో మహాపంచాయత్ పూర్తయిన తర్వాత దేశవ్యాప్తంగా తమ ఉద్యమాన్ని విస్తరిస్తామని పేర్నొన్నారు. త్వరలోనే బెంగాల్, కర్ణాటక, తమిళనాడు, గుజరాత్ రాష్ట్రాల్లో మహాపంచాయత్‌లు నిర్వహిస్తామని టికాయిత్ తెలిపారు. రైతులు చేస్తున్న ఆందోళన రెండు నెలలు దాటింది. ఇప్పటికే ప్రభుత్వం- రైతు సంఘాల మధ్య 11 దఫాలుగా చర్చలు జరిగాయి. రైతులతో చర్చలకు సిద్ధమని ఇటీవల ప్రధాని సైతం పేర్కొన్నప్పటికీ.. ఆ దిశగా ఎలాంటి అడుగులు పడకపోవడంతో చర్చలపై సందిగ్ధత నెలకొంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com