అమ్మాయికి కోట్లు తెచ్చిపెడుతున్న 'అమ్మ చిట్కాలు'.. రూ.20 వేల పెట్టుబడితో వ్యాపారం

ఏం క్రీములే తల్లీ.. చూసిన వన్నీ కొంటావు.. బోలెడు డబ్బులు తగలేస్తావు.. నా మాట విని ఆ పాల మీద మీగడలో పచ్చి పసుపు కలిపి రాసుకో నీ మొహం నిగ నిగ లాడకపోతే నన్నడుగు. ఊరికే జుట్టు ఊడుతోందని గొడవ చేయక కుంకుడు కాయలతో తల స్నానం చేయి. ఆ షాంపూలు, గీంపూలు పక్కన పడెయ్.. కొబ్బరినూనెలో కాసిని మందార పూలు కలిపి కాసి తలకు రాసుకో.. ఇవన్నీ నాకు మా అమ్మ చెప్పిందే.. నా మాట వింటే నువ్వూ బావుంటావు..
ఇలాంటి చిట్కాలకు ఇప్పుడు భలే డిమాండ్ ఉంది.. హాస్టల్లో ఉన్న అమ్మాయిలతో పాటు ర్యాంప్ వాక్ చేస్తున్న అందగత్తెల్నీ ఆకర్షిస్తున్నాయి. కాలేజీ అమ్మాయిలు సైతం అమ్మమ్మలు చెప్పిన చిట్కాలను ఆలకిస్తున్నారు. కాస్త పనే అయినా పాటించడానికి రెడీ అయిపోతున్నారు. ఇక రాజమహేంద్రానికి వచ్చిన అమృత అయితే అమ్మ చెప్పిన చిట్కాలతో వ్యాపారం ప్రారంభించి కోట్ల టర్నోవర్‌తో రన్ చేస్తోంది. నాన్న ఆయుర్వేద డాక్టర్. హాస్టల్లో ఉన్న అమృతకు అమ్మ పంపించిన వస్తువులే అందానికి ఆయుధాలుగా మారాయి.. అవి చూసిన స్నేహితులు తమకూ కావాలని అడగడం మొదలు పెట్టారు.
చదువు పూర్తయిన తరువాత క్యాంపస్ సెక్షన్‌లో ఉద్యోగం వచ్చింది. ఎమ్ఎన్సీ కంపెనీలో ఫైనాన్షియల్ హెడ్‌గా రెండేళ్లు పని చేసింది. అయితే చిన్నప్పటి నుంచి వ్యాపారం చేయాలనే కల అలానే మనసులో ఉండిపోయింది. ఆ టైమ్‌లో అమ్మ పంపించిన సహజ ఉత్పత్తులు గుర్తొచ్చాయి. దాన్ని వ్యాపారంగా మార్చాలనే ఆలోచన వచ్చింది. వెంటనే చేస్తున్న ఉద్యోగానికి రిజైన్ చేసి సహజ ఉత్పత్తులను గురించి మరింత అధ్యయనం చేసింది. అప్పటికే మార్కెట్లో ఇలాంటి వస్తువుల హవా నడుస్తుంది. ఏదైనా కొత్తగా చేస్తేనే వినియోగదారులను ఆకర్షిస్తామని అనుకుంది. రసాయనాలు, నిల్వకారకాలు లేకుండా గిరిజన ఉత్పత్తులతో తన వస్తువులకు రూపకల్పన చేసింది. కేవలం రూ.20వేల పెట్టుబడితో 2018లో రాజమహేంద్రవరంలో వ్యాపారం మొదలు పెట్టింది.
అమృత ప్రారంభించిన టైబ్ కాన్సెప్ట్ ప్రారంభించిన మూడు నెలలకే 30 వేల ఉత్పత్తులు అమ్ముడయ్యాయి. నువ్వులు, మెంతులు వంటి కొన్ని పదార్థాలతో తయారు చేసిన నూనె '90 డేస్ మిరాకిల్' మొదటి నూనె ఉత్పత్తి అని చెబుతుంది. ఇది ఊహించిన దాని కంటే బాగా పేరొచ్చింది. ఆ ఉత్సాహంతో మరో పది ఉత్పత్తుల్ని తయారు చేసింది. అమృత తయారు చేసిన ఉత్పత్తుల్లో రసాయనాలు కలపరు కాబట్టి డబ్బాను తెరిచిన ఆరు నెలల్లోగా వాడుకోవాల్సి ఉంటుంది.
వ్యాపారంలో ఎన్నో ఒడిదుడుకులు.. అన్నింటినీ అధిగమించి ఈ స్థాయికి చేరుకున్నానని ఆనందంగా చెబుతుంది అమృత. డిమాండ్‌కు తగ్గ ఉత్పత్తులు తీసుకురావాలని ఉన్నా తగినంత ముడిసరుకు లభ్యం కావట్లేదు. లాక్‌డౌన్ సమయంలో అమ్మకానికి సిద్ధంగా ఉంచిన సరుకంతా పాడైపోయింది. కార్మికులకు జీతాలివ్వలేని పరిస్థితి. వ్యాపారం అన్నాక కొంత నష్టాన్ని కూడా భరించాల్సి ఉంటుంది. ప్రస్తుతం వాటన్నింటినీ అధిగమించి వ్యాపారాన్ని తిరిగి పట్టాలెక్కించాలనుకుంటోంది. తన ఉత్పత్తులను విదేశాలకూ ఎక్స్‌పోర్ట్ చేస్తోంది.. కోట్ల రూపాయలను ఆర్జిస్తోంది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com